Narayanavanam Venkateswara Swamy Temple: శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు ఆలయం - నారాయణవనం

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు, శ్రీ పద్మావతీ అమ్మ వారు నెలకొని ఉన్న దివ్యక్షేత్రం నారాయణవనం. ఆకాశరాజు కుమార్తె శ్రీపద్మావతీదేవిని శ్రీనివాసుడు పరిణయమాడిన పరమపవిత్రస్థలం ఇది.

ఈ దివ్యక్షేత్రం తిరుపతికి 34 కి.మీ దూరంలో తిరుపతి- మద్రాసు మార్గంలో పుత్తూరుకు 5 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీనివాసుడు వేటకై వచ్చి నారాయణవనోద్యానంలో చెలికత్తెలతో విహరించుచున్న పద్మావతిని చూచి, మోహించి వివాహం చేసుకున్నాడు. కాబట్టి దీనికి నారాయణపురమని పేరొచ్చింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహమాడుటకై వరునిగా ఆవిర్భవించినందు వల్ల ఈ క్షేత్రం నారాయణవనంగా నేటికీ పిలువబడుచున్నది.

ఈ ఆలయప్రాభవ, ప్రాశస్త్యాలగురించి శ్రీ వేంకటా చలమాహాత్మ్యంలో వివరించబడింది. ఇక్కడి ఆలయాన్ని ఆకాశ రాజు కట్టించినట్లు భక్తుల విశ్వాసం.

శ్రీ వీరనరసింగ దేవయాదవరాయలు (1205- 1245) జీర్ణోద్ధరణ చేశారు. పెనుగొండ వీరప్పన్న నారాయణ వరంలో శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామివారి ఆలయంను క్రీ.శ. 1541-42 సం||ల కాలంలో పునఃనిర్మించినట్లు పేర్కొనబడినది.

1967వ సం|| ఏప్రిల్ నెల 29వ తేదీన ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధీనంలోనికి వచ్చింది.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి - ఇక్కడ అర్చామూర్తి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు. ఆయన సకలాభీష్టఫలప్రదుడు స్వామివారు తూర్పు ముఖంగా ఉన్నారు. వక్షఃస్థలంలో లక్ష్మీదేవి విరాజిల్లుతున్నది. స్వామివారు నడుముకు దశావతారవడ్డాణం ధరించి ఉన్నారు. భుజంపై సాలగ్రామమాల ధరించి- చక్రం, ఖడ్గం ధరించి ఉన్నారు. చేతిలో వేటఖడ్గం ఉన్నది.

శ్రీ పద్మావతీ అమ్మవారు ఆకాశరాజు యజ్ఞంకొరకు భూమి దున్నుచుండగా ఒక పేటికయందు పద్మములో దొరికింది కాబట్టి ఈమెకు పద్మిని, పద్మావతి అని పేర్లు. 

స్కాందపురాణం నందు ఈమె పేరు పద్మినిగాను, భవిష్యోత్తరపురాణంలో పద్మావతిగాను చెప్పబడినది. ఈమెను 'పద్మవల్లి' అనికూడ పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు మరొకప్రత్యేక ఆలయంలో నెలకొని ఉన్నారు. అమ్మవారి ఆలయవిమానమును విష్ణుశ్చంద్ర విమానం అంటారు. ప్రధాన ఆలయానికి నైఋతి దిశ యందు అమ్మవారి సన్నిధి ఉన్నది. అమ్మవారి ఆలయ ముఖ ద్వారంవద్ద కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున కల్పవృక్షం, కామధేనువులు దర్శనమిస్తాయి.

శ్రీ పద్మావతీ అమ్మవారు తూర్పుముఖంగా పద్మపీఠంపై ఆసీనురాలై చతుర్భుజంగా దర్శనమిస్తుంది. పూర్వం వేదవతియే పద్మావతిగా జన్మించినట్లు శ్రీ వేంకటాచలమాహాత్మ్యం పేర్కొ న్నది. ఆలయంచుట్టూ ప్రదక్షిణమార్గం ఉన్నది. దానిచుట్టూ మరొక ప్రాకారం కలదు. బయట మహాప్రదక్షిణమార్గం ఉన్నది.

ఆలయవాయవ్యదిశలో మనకు ఆండాళమ్మ (గోదా దేవి) ఆలయం దర్శనమిస్తుంది. ఆలయఉత్తరద్వారం ప్రతి సంవత్సరం వైకుంఠద్వాదశినాడు తెరుస్తారు.

కోదండరామస్వామి, రంగనాథస్వామి- ఈశాన్యంవైపు ఉన్న మందిరంలో శ్రీరంగనాథస్వామివారు, శ్రీకోదండరామస్వామి వారు వేంచేసి ఉన్నారు. ప్రక్కనే ఉన్నమండపంలో విష్వక్సేనులు, తిరుక్కచ్చినంబి, తిరుమంగై ఆళ్వారు, మళవాళముని విగ్రహాలున్నాయి.

శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం తూర్పు ముఖంగా ఉంది. రెండు పెద్దరాతిగడపలు దాటి లోపలకు వెళ్ళితే మనకు రెండువైపుల వాహనమండపాలు దర్శన మిస్తాయి. ఆగ్నేయదిశలో వంటశాల కలదు. అటునుండి దక్షిణ దిశగా వెళ్ళితే ఒక పెద్దమండపంలో పన్నిద్దరాళ్వారులు కొలువు దీరి ఉండడం చూడవచ్చు.

ప్రధానాలయానికి ముందు భాగాన పెద్ద ధ్వజస్తంభం కనబడుతుంది. దానికి పూర్తిగా రాగితొడుగు ఉన్నది. దాని ముందు బలిపీఠం ఉంది. ధ్వజస్తంభమునకు ఆనుకొని ఉన్న గరుడ మండపమందు గరుడఆళ్వారు స్వామికి అభిముఖంగా సన్నిధి చేసిఉన్నారు.

ఆలయగోపురాలు - ఆలయ ప్రధానరాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు. ఇది ఏడు అంతస్తులతో 150 అడు గుల ఎత్తున శోభాయమానంగా కనబడుతుంది. రెండవ గోపు రాన్ని వీరనరసింగ దేవయాదవరాయలు కట్టించారు. ఇది మూడు అంతస్తులలో ఐదుకలశాలతో విరాజిల్లుతున్నది. ఆలయం నాలుగుమూలలా బలిపీఠాలున్నాయి.

పంచబేరాలు - బేర మనగా మూర్తి, విగ్రహం అని అర్థం.స్వామివారి ఆలయంలో పంచబేరాలు కలవు. ఇంకను అండాళమ్మ విగ్రహం, శ్రీభక్తాంజనేయస్వామి విగ్రహం బహుసుందరంగా దర్శనమిస్తాయి.

 స్వామివారికి ప్రతినిత్యం సుప్రభాత సేవ జరుగుతుంది. అలాగే అర్చన, నైవేద్యం, ఏకాంతసేవ ప్రతిరోజు జరుగుతాయి. శుక్ర వారం అభిషేకం నడుస్తుంది. కల్యాణోత్సవం (ఆర్జితం) తెప్పో త్సవం, బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయి.


Comments

Popular This Week

Sri Raghavendra Aradhana: శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన 2024

Bedi Anjaneya Temple: శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం - తిరుమల

Nagasadhu: నాగ సాధువుల జీవన విధానం

Shani Shinganapur Temple: శని శింగణాపూర్ ఆలయం

Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

Swarna Gowri Vrat: స్వర్ణ గౌరీ వ్రతం

Subramanya Swamy Temple: మట్టిని ప్రసాదంగా ఇచ్చే సుబ్రమణ్య స్వామి ఆలయం

Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

Abyanghana Snanam: అభ్యంగన స్నానం

Random posts