Dharmapuri Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - ధర్మపురి

శ్రీ యోగానంద లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రం అత్యంత పురాతనమైనది. నవనారసింహక్షేత్రాలలో ఒకటి. పురాతనమైన ఈ క్షేత్రం గూర్చిన ప్రస్తావన క్రీ.శ. 928 కాలంలో ఉంది.

పద్మపురాణం, నారాయణ శతకం వంటి ప్రముఖ గ్రంథా లలో ఈ క్షేత్రం గూర్చి ప్రశంసలు కన్పిస్తాయి.

గర్భగుడిలో విభిన్న రూపాలతో ఉండే ఇద్దరు నారసింహులను దర్శించుకోవచ్చు. మొదటిది | పురాతనకాలంలో అనగా క్రీ.శ 1448లో ప్రతిష్టించబడినది. ఈ విగ్రహాన్ని పాత నారసింహస్వామి అనీ, ఆ తరువాత క్రొత్తగా అనగా క్రీ.శ.1725లో ప్రతిష్టించబడిన విగ్రహాన్ని కొత్త నారసింహస్వామి అనీ వ్యవహరిస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీలక్ష్మీదేవి వేరే వేదికపై నెలకొని ఉంటుంది.

స్థలపురాణం ప్రకారం హిరణ్యకశిపుని వధించిన అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుడిని శాంతింప చేయటానికి బ్రహ్మదేవుడు కఠోరమైన తపస్సును చేయనారంభించాడు. అదే సమయంలో తన కోసం తపమాచరిస్తున్న తన భక్తుడిని కూడా నారసింహుని ప్రసన్నుని చేయటానికి తపస్సు చేయమని చెప్పాడు. ఇంకా ఆ రాజుతో ఒక యజ్ఞం కూడా చేయిస్తాడు. వీరి తపములతో నరసింహస్వామి ప్రసన్నుడై వీరికి సాక్షాత్కరించి వీరి కోరికపై ఇక్కడ స్వయంభువుగా వెలిసాడని పురాణ గాథ. ధర్మవర్మ పాలించే ప్రాంతం కావటం వల్ల ఈ ప్రాంతం ధర్మపురిగా ప్రసిద్ధిగాంచింది.

నారసింహస్వామిని శాంతపరచటానికి బ్రహ్మ చేసిన ప్రయత్నానికి గుర్తింపుగా ఆలయంలో 6 అడుగుల బ్రహ్మ విగ్రహాన్ని భక్తులు దర్శించవచ్చు. ఇంకా ఇక్కడ కనిపించే యముని విగ్రహం వల్ల యముడు కూడా స్వామిని అర్చించాడని పురాణ గాథ. ఒక్కసారి ధర్మపురిని సందర్శించిన వారికి తిరిగి యమదర్శన అవసరం ఉండదని అనగా యమపురికి వెళ్ళరని అంటారు.

ఈ ఆలయం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడినది.

ఇక్కడ శ్రీరాముడు సీతాన్వేషణను చేస్తున్న సమయంలో ప్రతిష్టించిన శివలింగాన్ని చూడవచ్చు. అవే కాక ఇంద్ర, కుబేర, రామకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి.

నారసింహ, బ్రహ్మదేవ, రామలింగేశ్వర స్వాములు ఒకే చోట ఉండటం వల్ల ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రమని కూడా పిలుస్తారు.

చాలా తక్కువగా కనిపించే శ్రీదత్తాత్రేయుని ఆలయాన్ని ఇక్కడ చూడవచ్చు. బ్రహ్మపుత్రుడైన దత్తాత్రేయుని దర్శనం అత్యంత పుణ్యప్రదం. ఇంకా వినాయకుడు, సప్తమాతృకల విగ్రహాలను చూడవచ్చు.

వేదాలు పుట్టిన ప్రదేశంగా ధర్మపురిని చెబుతారు. అంతేకాక పురాతన సంస్కృతి, సాహిత్యం, సంగీతాలకి పుట్టినిల్లుగా చెబుతారు.

60 స్థూపాలతో నిర్మించబడ్డ మహిషాసురమర్ధిని ఆలయాన్ని చూడవచ్చు.

ఇంకా 500 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ సీతారామస్వామి ఆలయాన్ని చూడవచ్చు.

ఈ ప్రాంతంలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ బ్రహ్మగుండం, సత్యగుండం, పాలగుండం, చక్రగుండాలు ఉన్నాయి. దత్తాత్రేయ పురాణం ప్రకారం గోదావరి ఇక్కడ దక్షవాహినిగా (గోదావరి పశ్చిమం నుండి తూర్పుకి ప్రవహిస్తుంది కానీ ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తుంది. అందుకే గోదావరిని ఈ ప్రాంతంలో దక్షిణవాహినిగా పిలుస్తారు) ప్రవహించటం వల్ల ఇక్కడు మూడుసార్లు స్నానమాచరించి స్వామిని దర్శించుకున్న వారికి మూడు జన్మలలోని పాపములు తొలగిపోతాయి.


పన్నెండేళ్ళకి ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాలలో భక్తులు గోదావరి స్నానమాచరించి తరిస్తారు.

ఫాల్గుణమాసంలో ఫాల్గుణ శుద్ధఏకాదశి నుంచి 13 రోజుల పాటు స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. వైశాఖమాసంలో 9 రోజుల పాటు శ్రీనారసింహ జయంతోత్సవాలు మరియు ధనుర్మాసంలో ముక్కోటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి.దక్షిణాయణం పూర్తవుతున్న సందర్భంగా డిసెంబరులో మోక్ష ఏకాదశిని పండుగగా చేస్తారు.

స్వామివారికి నిత్యకళ్యాణాన్ని జరుపుతారు. ఇంకా నిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతినిత్యం ఉదయాన్నే అభిషేకం పంచామృతాలతో జరుగుతుంది.

శ్రీలక్ష్మీనరసింహస్వామిని పూజించటం వల్ల మానసిక, శారీరిక వ్యాధులు తొలగటమే కాక అప్లైశ్వర్యాలు సిద్ధించి జీవితం సుఖవంతం అవుతుంది. కుజదోషం, వివాహం అవటం లేని వారు, ఆరోగ్యసమస్యలు ఉన్న వారు, దేవాలయంలోని నారసింహుని ప్రతి మంగళవారం దర్శించుకుంటే సత్వర ఫలితం ఉంటుంది.

ఇక్కడ వేదబ్రాహ్మణులు వేదాలను నేర్చుకుంటారు. విద్యార్థులు నిత్యం గోదావరిలో స్నానమాచరించి విద్యని అభ్యసిస్తారు. 

కరీంనగర్ నుండి ధర్మపురి బస్సు మార్గం ద్వారా 67కి.మీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి కరీంనగర్ 164 కి.మీ. కరీంనగరానికి రైలుమార్గ సౌకర్యాలు కూడా ఉన్నాయి. జగిత్యాల నుండి 30కి.మీ, మంచిర్యాల నుండి 42 కి.మీ దూరంలో ఉంది.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Varjyam: వర్జ్యం అంటే ఏమిటి ?

Kashi Yama Aditya Temple: యమ ఆదిత్య ఆలయం - కాశీ