Singotam Narasimha Swamy Temple: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం - సింగోటం

తెలంగాణ రాష్ట్రంలో  నరసింహస్వామి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో సింగోటం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి.

మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండల కేంద్రానికి 10 కి.మీ. దూరంలో ఉన్న సింగవట్నం అనే గ్రామంలో శ్రీలక్ష్మీనృసింహస్వామిదేవాలయం ఎంతో ప్రఖ్యాతిగలది. సింగవట్నమే ఇప్పుడు సింగోటం. శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఈ క్షేత్రంలో లింగాకారంలో స్వయంభువుగా వెలిసారు. శివకేశవులకు భేదం లేదన్నట్టుగా రాతిలింగంపై త్రిపుండ్రాలు, ఊర్ధ్వపుండ్రం గుర్తులు ఉండడం ఇక్కడివిశేషం.

శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు సింగోటంలో వెలియడానికి 600 సంవత్సరాలక్రితం నాడు జరిగిన ఒక చారిత్రకగాథ ప్రచారంలో ఉంది. జటప్రోలును పరిపాలిస్తున్న సురభి వంశీయులపాలనలో ఈ గ్రామం ఉండేది. సురభి వంశీయులలో పదకొండవతరంవాడైన సింగమ భూపాలుడు పాలిస్తున్నకాలంలో జరిగినకథ ఇది.

ఒకరోజు సింగవట్నం గ్రామానికి చెందిన ఒక యాదవుడు తనపొలంలో నాగలిదున్నుతూ ఉండగా ఆ నాగలి కొనకు ఒకరాయి తగిలింది. ఎంతప్రయత్నించినా నాగలి ముందుకు కదలలేదు. అప్పుడు అతడు ఆ రాయిని తీసి, ఒడ్డున పెట్టి, తిరిగి వచ్చి, నాగలితో పొలం దున్నుతూన్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి, మళ్లీ నాగలికి అడ్డు పడింది. రైతు దాన్ని తీసుకొనివెళ్ళి, ఒడ్డుపై పెట్టడం, రాయి మళ్లీ దొర్లుకుంటూ రావడం ఇలా నాలుగైదుసార్లు జరిగింది. రైతుకు ఆశ్చర్యం కలిగి ఆ రాయిని తీసి, నీటితో శుభ్రం చేసి, తేరిపార చూశాడు. ఇంకేముంది? ఆ రాయిపై త్రిపుండ్రాలు, ఊర్ధ్వపుండ్రాలు, కన్నులు, ముక్కు, నోరు మొదలగు గుర్తులతో స్వామి కనిపించాడు. రైతు ఆశ్చర్యచకితుడై, ఆనందపరవశుడై తనను రక్షించమని ప్రార్ధించి, ఆ రాయిని అక్కడే పెట్టి, ఇంటికి చేరాడు.

శ్రీనరసింహస్వామివారు ఆ రాత్రికే ఆ ప్రాంతపు రాజు సింగమనాయుడికి మరియు ఆ రైతుకులలో కనిపించి, తాను శ్రీలక్ష్మీనరసింహస్వామి ననీ, రైతునాగలికి అడ్డువచ్చింది తానే ననీ, తెల్లవారేసరికి తనకు ఆలయం కట్టవలసిందని ఆదేశిం చాడు. సింగమనాయుడు వెంటనే మందీమార్బలంతో ఆ రైతు పొలం చేరుకుని, స్వామిని దర్శించి, వెంటనే గుడి కట్టించాడు. ఓరుగంటి వంశీయుడైన బ్రాహ్మణునిచే ప్రతిష్ఠ చేయించాడు.

ఈ దేవాలయ ప్రశస్తి “మదనగోపాలమాహాత్మ్యం" అనే స్థలపురాణంలో కూడా ఉంది. దానిప్రకారం పూర్వం సింగవట్నం ఒక అరణ్యప్రాంతం. కాశీనుండి సింహవటువు అనే బ్రహ్మచారి ఈ దారివెంట అహోబిలం వెళ్తున్నాడు. అప్పుడు అతనికాలికి ఒకరాయి తగిలి మూర్చపోయాడు. ఆ మగతలో అతనికి "నీవు అహోబిలంవరకు రా నక్కరలేదు. ఇక్కడే ఉండి తపస్సు చేయి" అనే మాటలు వినిపించాయి. అప్పుడతడు అక్కడే ఉన్న ఒకచెట్టుక్రింద కూర్చొని, తపస్సు కొనసాగించాడు. కొన్నిరోజులకు స్వామి ప్రత్యక్షమై నీ కాలుకు తగిలిన రాయిలోనే నే నున్నా ననీ, నిత్యం ఆరాధించమనీ చెప్పాడు. ఆ రోజునుండి ఆ బ్రహ్మచారితో పాటు, ఆ గ్రామప్రజలందరూ ఆ రాతిలోనే శ్రీ నృసింహస్వామిని దర్శిస్తూ, మ్రొక్కుతూ, తమ కోరికలు నెర వేర్చ మని ప్రార్థిస్తుంటారు.


శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ పెదజీయరుస్వామివారు ఈ దేవాలయాన్ని దర్శించి, గర్భగుడి ప్రక్కనే, స్వామికి ఎడమ వైపున శ్రీమద్రామానుజులదేవాలయాన్ని ఏర్పాటు చేసి, వేదార్థం వంశీయులను అర్చకులుగా నియమించాడు. ఈ దేవాలయ ప్రాంగణంలో శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, శ్రీలక్ష్మీ గణపతి, నవగ్రహఆలయా లున్నాయి. ఈ దేవాలయానికి సుమారు కిలోమీటరు దూరంలో గల గుట్టపై శ్రీలక్ష్మీదేవిఅమ్మ వారిదేవాలయం ఉన్నది. రాణీవేంకటరత్నమాంబ ఈ దేవాలయాన్ని నిర్మించింది. కాబట్టి ఈ గుట్టకు రత్నగిరి అనీ, ఈ దేవాలయానికి శ్రీరత్నలక్ష్మీదేవాలయం అనీ పేరు వచ్చింది.

ఈ క్షేత్రానికి ఎడమవైపున రత్నసాగరం అనే పెద చెరువు, కుడివైపున స్వామివారిపుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో  స్నానం చేసి, తడిబట్టలతో స్వామివారిని దర్శిస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుందనీ, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ భక్తుల ప్రగాఢవిశ్వాసం.

ప్రతిసంవత్సరం మకరసంక్రాంతిపర్వదినంనుండి వారం రోజులపాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పండుగ తర్వాత మూడోరోజున జరిగే రథోత్సవంసందర్భంగా సుమారు లక్షమంది పాల్గొంటారు. బ్రహ్మోత్సవాలు తర్వాత నెలరోజుల పాటు జాతర కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలే కాక వివిధ పర్వదినసమయాలలోను నిత్యం ఎందరో భక్తులు స్వామిని సేవిస్తూ తరిస్తుంటారు. 

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి