వ్యాస మహర్షి రచించిన స్కాందపురాణంలోని వేంకటాచల మహత్యం లో వివరించిన ప్రకారం ఏడు కొండల్లో ఓ కొండ హనుమంతుని మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్ధిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాబాలి తీర్థం ఉన్న ప్రదేశం.
హనుమాన్ జన్మించిన ప్రదేశం జాపాలిని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయి.
జాపాలి తీర్థం విశిష్టత
జాపాలి మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. జాపాలి తీర్ధం చిత్తూరు జిల్లా తిరుమల కొండపైన శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. స్కంద పురాణంలో, వేంకటాచల మహత్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించారు. తిరుమల కొండపైన పాపనాశానానికి వెళ్లే మార్గంలో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గంలో కనిపిస్తుంది. ప్రకృతి రమణీయతల మధ్య నెలకొని ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి తో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది.
పురాణ గాథ
జాపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా రుద్రుడు ప్రత్యక్షమై తన రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాపాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి జాపాలి తీర్థంగా పేరొందింది.
వాక్ దోషాన్ని పోగొట్టుకున్న జాబాలి
రామాయణంలోని అయోధ్య కాండలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్ దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి.
హనుమంతుని స్వరూపమే
జాపాలి తీర్థంలో వెలసిన హనుమంతుని ఆలయం అత్యంత రమణీయంగా ఉంటుంది. గర్భాలయంలో వెలసిన స్వామి సింధూర అలంకరణతో ఒక చేత్తో గదను ధరించి రజత కవచాలంకృతుడై భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. స్వామి వారి శిరస్సుపై భాగాన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటాయి.
శ్రీరాముని పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం
రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థం లో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం కూడా ఉంది. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమని పేర్లు వచ్చాయ్. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటి ఉన్నాయి. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్లే భక్తులు జాబాలి తీర్ధాన్ని కూడా దర్శించడం పరిపాటి.
Comments
Post a Comment