Ahobilam Temple: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం - అహోబిలం

అహోబిలం... ప్రసిద్ధి గాంచిన ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని  కర్నూలు జిల్లాలోని 'నంద్యాల' నుండి 42 కి. మీ దూరంలో ఉంది. నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రం క్రీ.శ.1398లో స్థాపితమైనదవటం విశేషం. ఈ క్షేత్రం అతిపురాతనమైనదని నృసింహ పురాణం ప్రకారం వెల్లడవుతోంది.

108 దివ్యక్షేత్రాలలో మొదటిది తిరుమల కాగా రెండవది అహోబిలం. స్వామి యొక్క తొమ్మిది రూపాలు ఇక్కడ ఒకేచోట నెలకొని ఉండటం ఈ ఆలయ ప్రాముఖ్యత అని చెప్పుకోవచ్చు. అయితే దిగువ అహోబిలం, ఎగువ అహోబిలంగా స్వామి రెండు ప్రదేశాలలో దర్శనమిస్తారు. దిగువ అహోబిలంలో స్వామి సమీపంలోనే భార్గవ, యోగానంద, ఛత్రవట నారసింహులు దర్శనమిస్తారు. ఇంక ఎగువ అహోబిలమునకు సమీపంలో వరాహ, కారంజ, మాలోల, జ్వాలా, పావన నారసింహలు దర్శనమిస్తారు. 

నృసింహ పురాణం ప్రకారంగా ఈ ప్రదేశమునందే తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుని బారినుంచి రక్షించుటకు స్వామి స్తంభం నుంచి ఉగ్రాకారమైన నృసింహ ఆకారంలో ఉద్భవించాడు. ఇప్పటికీ ఉగ్రస్తంభం అక్కడ కనిపిస్తుంది. 

ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు భైరవుడు.

నల్లమల కొండలపై నెలకొన్నది అహోబిలం. నల్లమల కొండలు శేషుని ఆకారమనీ, శేషుని శిరస్సుపై తిరుమల, మధ్యన అహోబిలం, తోక చివరిగా శ్రీశైలక్షేత్రాలు ఉన్నాయి

ఈ ఆలయం వైష్ణవ ఆలయాలలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం. ఎగువ అహోబిలంలో ప్రధానమూర్తి ప్రహ్లాద వరద నారసింహుడు. ఈ స్వామి ఆలయం అండాకారంలో మండపాలతో ఉంటుంది. ఎగువ అహోబిలం దిగువ అహోబిలం నుండి 8 కి. మీ దూరంలో కొండపై ఉంటుంది. ఇక్కడ నుండే శ్రీమహావిష్ణువు నారసింహ ఉగ్రరూపంతో స్థంభంలో నుండి వచ్చిన స్తంభమును మనము వీక్షించవచ్చు.

దిగువ అహోబిలం దక్షిణ భారత నిర్మాణ శైలిలో నిర్మించబడినది.

 ఎగువ అహోబిలంలో ఉండే మూర్తులు :

1. అహోబిలం నారసింహ స్వామి : కొండపై గల ఆలయంలో ప్రధాన మూర్తి. దిగువ అహోబిలం నుండి 8 కి.మీ దూరంలో నెలకొని ఉంది. స్వామి తన స్వరూపమైన ఉగ్రనరసింహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వయంభువు ఈ స్వామి. ఇక్కడ ఉన్న 9 ఆలయాలలో కెల్లా అతి పురాతనమైన, విశేషమైన, మహిమగల ఆలయం. స్వామి భక్తుల కోరిన కోర్కెలను తప్పక తీరుస్తాడు.

2. క్రోడా నారసింహ స్వామి : వరాహ నారసింహునిగా కూడా పిలబడే ఈ స్వామి ప్రధాన ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో నెలకొని ఉంటారు. ఈ ఆలయంలోని స్వామి రూపం తల వరాహాకారంలోనూ, శరీరం మానవరూపం లోనూ, తోక సింహపు తోకను పోలి ఉండి రెండు చేతులతో దర్శనమిస్తారు. ప్రక్కన లక్ష్మీ అమ్మవారు దర్శనమిస్తారు. స్వామి రూపం అత్యంత ఆనందదాయకం. స్వామిని చూసినంతనే హృదయం పులకింతకు గురి అవుతుందనటంలో అతిశయోక్తి లేదు.

3. జ్వాలా నారసింహ స్వామి : ప్రధాన ఆలయానికి 4 కి. మీ దూరంలో ఉంటుంది. ఈ స్వామి ఆలయం 'అచలఛాయమేరు' అనే కొండపై ఉంటుంది. ఇక్కడకి చేరటం అతి క్లిష్టతరం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోనే స్వామి తన భక్తుడైన ప్రహ్లాదుడి ప్రార్థనతో ఉగ్రగరూపంలో వచ్చి హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చినట్టు చెబుతారు. క్రోధ రూపంలో ఊగిపోతున్న స్వామిని గంగతో అభిషేకించి శాంతపరిచారని ఒక పురాణ గాథ. మహాలక్ష్మీదేవి చెంచులక్ష్మి అవతారం దాల్చి స్వామిని శాంతపరిచిందనే మరొక గాధ కూడా పురాణాలలో ప్రసిద్ధి గాంచి ఉంది. దేవతలు స్వామిని అభిషేకించిన జలం ఇక్కడ ఉన్న లోయలో ప్రవహిస్తుందని అది ఇప్పుడు 'భవనాశిని' అనెడి పేరుతో పిలవబడుతోంది.

ఇక్కడ ప్రసిద్ధి గాంచిన మరో రెండు విశేషాలు ఉన్నాయి. అవి ఉగ్రస్థంభం, ప్రహ్లాద మెట్టు.

4. మాలోల నారసింహ స్వామి : ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ప్రదేశం. ఇక్కడ నిర్మించబడిన ఆలయంలోని స్వామి మాలోల నారసింహుడు. లక్ష్మీదేవి జోక్యంతో శాంతమూర్తిగా మారిన స్వామి ఒక్కడ శాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తారు. మాలోల అనగా లక్ష్మీప్రసన్నుడనీ, లక్ష్మీప్రీతుడని, లక్ష్మీలోలుడని అర్థం.


దిగువ అహోబిలంలో ఉండే మూర్తులు :

1. యోగానంద నారసింహ స్వామి : దిగువ అహోబిలంలో ఉండే ఈ ఆలయంలోని స్వామికి ఈ పేరు రావటానికి ఒక కారణం ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం శాంతించిన స్వామి ప్రహ్లాదునికి యోగాసనాలను నేర్పి ఇక్కడ యోగానంద నారసింహునిగా వెలసి ప్రసిద్ధి గాంచారని ప్రతీతి. ఈ స్వామి ఆలయం ఆగ్నేయంగా నిర్మించబడి ఉంటుంది.

2. ఛత్రవట నారసింహ స్వామి : దిగువ అహోబిలంలో ఆగ్నేయ దిశగా 4 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ స్వామి ముఖ మంటపం గొడుగు వంటి మర్రిచెట్టు నీడన ఉంటుంది. స్వామి దర్శనం అత్యంత దరిద్రనాశకం. ఐశ్వర్యాదులను ప్రసాదించే ఈ స్వామి దర్శనం పరమపావనకరం.

3. పావన నారసింహ స్వామి : పరమపావనమైన పావనీ నదీతీరంలో వెలిసి ఉన్నారు స్వామి. అందువలననే స్వామికి పావన నారసింహుడని పేరు వచ్చినది. ఈ ఆలయం ఎగువ అహోబిలంలోని ప్రధానాలయానికి దక్షిణ దిశలో సుమారుగా 6 కి.మీ దూరంలో ఉంటుంది.

4. భార్గవ నారసింహ స్వామి: దిగువ అహోబిలం కొండకి 2 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్నారు ఈ స్వామి. స్వామి ఆలయం భార్గవ తీర్థంలో ఉన్నది. ఈ ప్రదేశానికి ఈ పేరు రావటానికి కారణం భార్గవరాముడు ఈ ప్రదేశంలో తపస్సు చేశాడని చెబుతారు. ఈ ప్రాంతంలోనే స్వామి వేంచేసి ఉన్నారు కావున స్వామి భార్గవ నారసింహుడని ప్రసిద్ధిగాంచారు.

ఈ ఎనిమిది నారసింహులతో పాటు కరంజి నారసింహ స్వామి ఉన్నారు. ఈయన దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి వెళ్ళే మార్గం మధ్యంలో కరంజి వృక్షం క్రింద ప్రతిష్టింపబడి ఉన్నారు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి