Bonalu Dates 2025: బోనాల పండుగ తేదీలు 2025
ఆషాఢ మాసం పరాశక్తిని ఆరాధించే మాసం. ఈ మహాశక్తియే గ్రామగ్రామాన జగదాంబికగా, మహంకాళిగా, ఎల్లమ్మతల్లి, పోచమ్మతల్లి, నూకాలమ్మ, పెద్దమ్మతల్లి, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మలుగా ఆయా చోట్ల కొలువుదీరి, ఆ జగన్మాత అందరిచేత ఆరాధనలందుకుంటోంది. పేర్లు వేరైనా తల్లి ఒక్కటే. తెలంగాణలో అత్యంత గొప్ప పండుగలలో బోనాల పండుగ ఒకటి.
బోనాల పండుగ: వెయ్యేళ్ల చరిత్ర, తెలంగాణ సంస్కృతి
బోనాల పండుగ వైభవానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. తెలంగాణలోని ప్రతి ఇంటి ఆడపడుచు అమ్మవారి అవతారంగా మారి ఈ పండుగలో పాల్గొంటుంది. ఆషాఢ మాసంలో నాలుగు ఆదివారాలు నాలుగు విభిన్న ప్రాంతాలలో జరిగే ఈ పండుగ, తెలంగాణ అంతటా జరిగినా, ముఖ్యంగా జంట నగరాలు (హైదరాబాద్-సికింద్రాబాద్) బోనాల పండుగకు కేంద్ర బిందువుగా మారుతాయి. ఈ మహత్తర పండుగ సంబరానికి శ్రీకారం చుట్టేది మాత్రం గోల్కొండ కోటలో వేంచేసి ఉన్న జగదంబిక బోనాలు. ఆ తల్లికే తొలి బోనం సమర్పిస్తారు.
వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న జగదంబికా తల్లికి తొలి బోనం అందించే ఆచారాన్ని మహావీరుడైన ప్రతాపరుద్రుడే స్వయంగా ప్రారంభించాడు. స్వయంగా జగదంబికా తల్లికి పూజలు చేసి అమ్మ అనుగ్రహంతో తమ సామ్రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్నాడు. ఆనాడు ప్రతాపరుద్రుడు ప్రవేశపెట్టిన ఆచారాన్ని నేటికీ జంట నగర వాసులు ఆచరిస్తూ అమ్మ సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు.
హైదరాబాద్ సంస్థానంలో పాలకులు నవాబులు ఉన్నప్పటికీ, జగదంబికా ఆరాధన విషయంలో, బోనాల పండుగ జరుపుకునే విషయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టకపోవడం గమనార్హం. ఈ పండుగపై ఆంక్షలు పెడితే హిందువులలో కలిగే ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని వెనకడుగు వేశారని చెబుతారు. అందువల్ల, మొదటి బోనం జగదంబికా తల్లికి అందించే ఆచారం వెయ్యేళ్ల నుండి నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. జగదంబికా తల్లి అంటే నవాబులకు భయంతో పాటు భక్తి కూడా ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. జగదంబికా తల్లి అనుగ్రహిస్తే అంతా మంగళప్రదమే కానీ, అమ్మ ఆగ్రహిస్తే ఇక మన్ను మిన్నూ ఏకం కావాల్సిందే. జగదంబికా భక్తులకు కరుణించి వరాలనిచ్చే కరుణామూర్తి, దుష్టులను కడతేర్చే జ్వాలా రక్త నేత్ర విభూషిత ఐన ఉగ్ర మూర్తి.
బోనాల సంబరం: కనుల పండువ
బోనాల పండుగను దివ్యంగా, భవ్యంగా జరిపే జంట నగరాలలోని అన్ని అమ్మవారి దేవాలయాలకు సంబంధించిన ధర్మకర్తలను, ఆలయ పాలక మండలి సభ్యులను జగదంబికా దేవస్థానం సగౌరవంగా ఆహ్వానిస్తుంది. ప్రభుత్వ అధికారులు, మంత్రులు అమ్మవారికి అధికార లాంఛనాలతో కానుకలు, వస్త్రాలు సమర్పిస్తారు. గోల్కొండ ఖిల్లాపై జగదంబికా ఆలయం పండుగ కళతో శోభిల్లుతూ ఉంటుంది. లక్షలాది మంది భక్తుల రాకతో గోల్కొండ ఖిల్లా కళకళలాడుతూ ఉంటుంది. కొండ కింది నుంచి పైదాకా నేల కనిపించదు, అంతా భక్తులే కనిపిస్తారు. భక్తులలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. బోనం ఎత్తుకున్న ప్రతి స్త్రీ మూర్తి లయబద్ధంగా అడుగులు వేస్తుంది. తలపై బోనం పెట్టుకుని, ముఖానికి పసుపు రాసుకొని, నుదుట పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని, వేప మండలు, నిమ్మకాయ దండలు, పూలదండలు మెడన ధరించి ఆ తల్లులు వస్తుంటే గుడిలోని జగదంబికా తల్లియే కదలివస్తున్నట్లు అనిపిస్తుంది.
తెలంగాణ ఆడపడుచుల పండుగ
జంట నగరాలలో జరిగే అన్ని అమ్మవారి దేవాలయాలలో బోనాల పండుగ సంబరాలకు జగదంబికా అమ్మవారికి సమర్పించే తొలి బోనమే స్ఫూర్తిదాయకం. అందుకే జగదంబికా తొలి బోనానికి ఇంతటి ప్రాధాన్యత ఉంది. మొక్కులు తీరిన తరువాత బోనం ఎత్తి మొక్కులు చెల్లించుకునే వారు, కొత్తగా మొక్కులు కోరుకొని బోనాలు సమర్పించేవారు, తొట్టెలతో వచ్చేవారు, ఫలహార బండ్లతో వచ్చేవారు... కదంతొక్కుతున్న పోతురాజుల ఉద్వేగ విన్యాసాలు, డప్పుల మోతలతో బోనాల సంబరం అంబరాన్ని తాకుతుంది. ఆ సంబరం కళ్ళతో చూడాలి కానీ మాటలతో వర్ణించలేము.
బోనాల పండుగకు దేశంలోనే కాదు విదేశాలలో ఉన్న తెలంగాణా ఆడపడుచులు తమ పుట్టింటికి చేరుకుంటారు. ఇల్లంతా బంధువులతో నిండిపోతుంది. అత్తవారి ఇంటి నుంచి తమ బిడ్డలు ఎలా పుట్టింటికి వస్తారో, అమ్మవారు కూడా ప్రతి ఇంటికి ఈ ఆషాఢ మాసాన వస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే అమ్మకు ఆహ్వానం పలకాలని తమ గృహాలకు మామిడి ఆకుల తోరణాలతో, బంతిపూల దండలతో గడపలను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. కొత్త కుండలో చిక్కని పాలతో బెల్లం, జీడిపప్పు, బాదం, కిస్మిస్, యాలకులు ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు పాయసాన్ని తయారుచేసుకుంటారు. ఇంటిలోని అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తరువాత పసుపు కుంకుమలతో అలంకరించిన ఆ కొత్త కుండ పాయసాన్ని తలకెత్తుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి బంధుమిత్రులతో చేరుకుంటారు. భోజనం అనే మాటకు వికృతి బోనం అని అర్థం. అందువలన ఈ పండుగ బోనాల పండుగతో సుప్రసిద్ధమైంది. ఈ పండుగను తెలంగాణ రాష్ట్రం అధికారిక పండుగగా గుర్తించి ప్రోత్సహిస్తోంది. బోనాల పండుగ వచ్చిందంటే ఆ బాలగోపాలానికి అవధి లేని ఆనందం.
ప్రముఖ ఆలయాలు, బోనాల పండుగ కేంద్రాలు
జంట నగరాలలో అన్ని అమ్మవారి ఆలయాలలో బోనాల పండుగ చాలా గొప్పగా జరిగినా, కొన్ని ఆలయాలను ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. ఆషాఢ మాసంలో గోల్కొండ జగదంబికకు తొలి బోనం సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
తరువాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో అసాధారణ రీతిలో జరుగుతాయి. ఈ ఆలయానికి కూడా గొప్ప చరిత్ర ఉంది. ఈ తల్లి కూడా మహిమాన్వితమైనది. ఆశ్రితజన కల్పవల్లి ఉజ్జయినీ మహంకాళి. ఇక బావిలో వెలసిన శక్తి, బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్న శక్తి బల్కంపేట ఎల్లమ్మ. ఈ తల్లి కూడా ఎంతో సత్యం గల తల్లి. కోరిన కోర్కెలను అతి శీఘ్రంగా నెరవేరుస్తుంది బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఇక నాలుగవ బోనం చిలుకలగూడ సమీపంలోని పోచమ్మ, కట్టమైసమ్మ ఆలయంలో. ఇలా వరుస క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా మాతేశ్వరి ఆలయంలో జరుపుకుంటారు. హరి బౌలిలో అక్కన్న మాదన్న దేవాలయం అలాగే షాలిబండ ముత్యాలమ్మ ఆలయంలో, ఇతర ప్రముఖ ఆలయాలు అన్నీ కూడా బోనాల పండుగకు ముస్తాబవుతాయి. డప్పులతో పోతురాజుల విన్యాసాలతో, కొరడా శబ్దాలతో సమూహాలుగా ఆలయానికి కదిలి వస్తుంటారు. ప్రతి ఇంటి ముందు నీళ్ళ బానెతో నిండా ఉన్న గృహిణులు, పెళ్ళికాని ఆడవారు ఎంతో భక్తితో బోనం ఎత్తుకుని వచ్చిన మహిళల కాళ్ళు కడుగుతారు.
2025 సంవత్సరంలో బోనాల పండుగ తేదీలు
బోనాల పండుగ ప్రారంభం: జూన్ 26, 2025, గురువారం (గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో)
బోనాల పండుగ ముగింపు: జూలై 24, 2025, గురువారం
ముఖ్యమైన బోనాల తేదీలు:
జూన్ 26, గురువారం:** మొదటి బోనం (గోల్కొండ జగదాంబిక అమ్మవారికి)
జూన్ 29, ఆదివారం:** రెండవ బోనం
జూలై 3, గురువారం:** మూడవ బోనం
జూలై 6, ఆదివారం:** నాల్గవ బోనం
జూలై 10, గురువారం:** ఐదవ బోనం
జూలై 13, ఆదివారం: ఆరవ బోనం (సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు)
జూలై 17, గురువారం: ఏడవ బోనం
జూలై 20, ఆదివారం: ఎనిమిదవ బోనం (లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు)
జూలై 24, గురువారం: తొమ్మిదవ బోనం (బోనాల ఉత్సవాల ముగింపు)
ఈ తేదీలలో తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
Comments
Post a Comment