Ashada Month Significance: ఆషాఢ మాసం: ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత
ఆషాఢ మాసం, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకతో సహా భారతదేశంలోని పలు ప్రాంతాలలో విశేషమైన సాంస్కృతిక, మతపరమైన, సాంప్రదాయక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది వేసవి (గ్రీష్మ ఋతువు) తీవ్రత నుండి రుతుపవనాల (వర్ష ఋతువు) ఆరంభానికి వారధిగా పరిగణించబడుతుంది.
ఆషాఢ మాసం ప్రాముఖ్యత
ఆషాఢ మాసం మొదటి రోజు, పాడ్యమి, తొలి మేఘాల ఆగమనంతో రుతుపవనాలను ఆహ్వానిస్తుంది. మండు వేసవి నుండి ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. దీని అర్థం కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. అందుకే, ఈ నెలలో క్రింది ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు:
* వివాహాలు
* గృహప్రవేశాలు
* ఆస్తి కొనుగోళ్లు
* కొత్త వ్యాపారాలు ప్రారంభించడం
* కొత్త వాహనాల కొనుగోలు
సాంప్రదాయ పద్ధతులు, నమ్మకాలు
తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో ముఖ్యంగా పాటించే ఒక సంప్రదాయం ఏమిటంటే, కొత్తగా పెళ్లయిన దంపతులను, అత్తా-కోడళ్లను ఈ మాసంలో దూరంగా ఉంచడం. ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే, వేసవిలో ప్రసవం అవుతుందని, తల్లీ-బిడ్డలకు ఆరోగ్య సమస్యలు రావచ్చని పూర్వం భావించేవారు. సరైన వైద్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో, ఈ సంప్రదాయం ఆరోగ్యపరమైన ముందు జాగ్రత్తగా పాటించేవారు.
ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలు
ఆషాఢ మాసం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో దైవ కార్యక్రమాలు, పూజలు, స్నానాలు, దానాలు, జపాలు, ధ్యానం, పారాయణాలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఆషాఢంలో సముద్ర, నదీ స్నానాలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతారు. అలాగే, పాదరక్షలు, గొడుగు, ఉప్పు వంటివి దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు
ఆషాఢ మాసం అనేక ముఖ్యమైన పండుగలు, పర్వదినాలతో నిండి ఉంటుంది:
తొలి ఏకాదశి / శయన ఏకాదశి: ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది. ఇది చాతుర్మాస్య వ్రతం ప్రారంభాన్ని సూచిస్తుంది.
బోనాల ఉత్సవాలు: తెలంగాణ ప్రాంతంలో ఈ సమయంలోనే సాంప్రదాయబద్ధంగా బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
అమృత లక్ష్మి వ్రతం: ఆషాఢ శుద్ధ శుక్ల పక్షంలో మహిళలు ఈ వ్రతాన్ని జరుపుకుంటారు.
గురు పౌర్ణమి / వ్యాస పూర్ణిమ: త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం ఇది.
పూరీ జగన్నాథ రథయాత్ర: ఆషాఢ శుద్ధ విదియ నాడు, బలభద్ర, సుభద్ర రథయాత్రలతో పాటు కన్నుల పండుగగా జరుగుతుంది.
దక్షిణాయనం: సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన నాటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఇది పూర్వీకులకు ప్రీతికరమైనదిగా పురాణాలలో పేర్కొన్నారు.
చాముండేశ్వరి దేవి పుట్టినరోజు :కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన చాముండేశ్వరి దేవి పుట్టినరోజు కూడా ఈ మాసంలో వస్తుంది. ఈ సమయంలో దేవతను, శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే పుణ్యం లభిస్తుందని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
స్కంద పంచమి: ఆషాఢ శుద్ధ పంచమి నాడు సుబ్రహ్మణ్యస్వామిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
కుమార షష్ఠి: ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకుంటారు. శుక్ల పక్ష షష్ఠినాడు శ్రీ సుబ్రహ్మాణ్యస్వామిని పూజించి, కేవలం నీటిని మాత్రమే స్వీకరించి ఉపవాసం ఉండి, మరుసటి రోజు ఆలయాన్ని దర్శిస్తే వ్యాధులు తొలగిపోయి ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్ముతారు.
ఆరోగ్య, పరిశుభ్రత అంశాలు
ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు, ఆషాఢ మాసాన్ని "అనారోగ్య మాసం" అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సమయంలో కాలువలు, నదులలో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లో చేరే నీరు కూడా కలుషితమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
గోరింటాకు సంప్రదాయం
ఆషాఢ మాసంలో అమ్మాయిలందరూ గోరింటాకుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మహిళలంతా ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడం ఒక వేడుకలాగా జరుపుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని ఒక ఆచారం ఉంది. అంతేకాకుండా, గోరింటాకు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదపరంగా అనేక ఔషధ గుణాలు ఉన్న గోరింటాకును ఈ కాలంలో పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఇది పూర్వ కాలం నుండి సత్సంప్రదాయంగా పాటిస్తున్నారు.
Comments
Post a Comment