Apara Ekadasi: అపర ఏకాదశి
వైశాఖ బహుళ ఏకాదశిని ‘అపర ఏకాదశి’గా జరుపుకుంటారు . ఈ పవిత్ర రోజు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి జయంతిగా జరుపుకుంటారు. పురాణ కథనాల ప్రకారం, దక్షయజ్ఞ సమయంలో సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ సమయంలో పరమేశ్వరుడు తన జటాజూటంనుంచి భద్రకాళిని సృష్టించాడు. ఈ దేవత ఉగ్రరూపంగా కనిపించినా భక్తులకు మాత్రం శాంతమూర్తిగా ఆరాధ్యురాలు.
అపర ఏకాదశి మహత్యం
ఇతర ఏకాదశి రోజుల్లాగానే, అపర ఏకాదశి నాడు ఉపవాసం, భగవంతుని పూజ, జాగరణ ముఖ్యం.
ఈ ఏకాదశి ఉత్తరాది రాష్ట్రాల్లో భద్రకాళి పూజకు సంబంధించిన విశిష్టతను కలిగి ఉంది. ఒడిషాలో ఈ రోజును జలకృద ఏకాదశిగా పిలుస్తారు, ఈ సందర్భంగా జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
"అపర" అనే పదానికి వేదాంతంలో లౌకికత అనే అర్థం ఉంది. ఈ ఏకాదశి ఆచరణ ద్వారా సాంసారిక కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. మరో అర్థంలో, "అపర" అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర, భగవంతుని ఆరాధన ద్వారా ఆ మాయ తొలగిపోతుందని శాస్త్ర వచనం చెబుతోంది.
ఉపవాస పద్ధతులు
దశమి నాడు సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి.
ఏకాదశి రోజు తల స్నానం చేసి, మహా విష్ణువుని పూజించాలి.
వండిన పదార్థాలను త్యజించి, పాలు, పండ్లతో ఉపవాసం పాటించాలి.
రాత్రి వేళ జాగరణ ఉండాలి, ద్వాదశీ ఘడియల్లో పాలు తాగి ఉపవాసాన్ని విరమించాలి.
అపర ఏకాదశి పూజ విధానం
శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి.
తూర్పు వైపు పసుపు వస్త్రాన్ని పరచిన పీటపై విష్ణు-లక్ష్మి విగ్రహాన్ని ఉంచాలి.
ధూప, దీపం వెలిగించి, పండ్లు, పూలు, తమలపాకులు, కొబ్బరికాయ సమర్పించాలి.
కుడి చేతిలో నీరు పట్టుకుని భక్తులు తమ కష్టాలు తీరాలని ప్రార్థించాలి.
సాయంత్రం అపర ఏకాదశి కథను చదవాలి లేదా వినాలి.
పురాణాల్లో, అపర ఏకాదశిని నిష్ఠగా ఆచరించేవారికి పాప విమోచనం లభిస్తుందని విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పాడట.
ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా, భక్తులు ఆధ్యాత్మికంగా పరిపూర్ణత పొందుతారని విశ్వసిస్తారు.
ఈ పవిత్ర ఏకాదశిని భక్తితో పాటిస్తూ, శ్రీహరి కృపకు పాత్రులవ్వండి
2025: మే 23.
Comments
Post a Comment