సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తుంటాడు. అక్టోబర్ నెలలో సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించనున్నాడు.
తులా సంక్రమణం జరిగిన నెల రోజులు పరమ పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. ఈ మాసంలో పగటికాలం తగ్గుతూ, రాత్రి కాలం పెరుగుతూ వస్తుంది. తులా సంక్రమణం రోజు నదీ స్నానం చేయడం శ్రేష్ఠం. అందులోనూ కావేరీ నదిలో స్నానం చేస్తే ఇంకా మంచిది.
తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు.ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చిన గర్వంతో సంతోషించినట్లు, రైతులు తమ వరి పొలాల్లో పండించిన పంటకు, సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే తులా సంక్రాంతిని గర్భాన సంక్రాంతి అని కూడా పిలుస్తారు. ప్రత్యేకంగా ఒడిశా, కర్ణాటకలలో తులా సంక్రమణం విశేషంగా జరుపుకుంటారు.
తులా సంక్రమణం రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే ఆ సిరుల తల్లి అనుగ్రహంతో ఏడాది పొడవునా పంటలు బాగా పండి ఆహారానికి కొరత ఉండదని రైతుల విశ్వాసం. ఈ పర్వదినాన రైతుల కుటుంబాలు లక్ష్మీదేవికి గోధుమ ధాన్యాలు, కూరగాయల మొక్కల కొమ్మలతో పాటు తాజా వరి ధాన్యాలు, తాటి కాయలు, పసుపు, కుంకుమ, గంధం, గాజులు లాంటి మంగళ ద్రవ్యాలను సమర్పించి పంటలు బాగా పండాలని కోరుకుంటారు.
తులా సంక్రమణం రోజు కర్ణాటక, ఒడిశా వంటి ప్రాంతాలలో పట్టు వస్త్రంలో కప్పిన కొబ్బరికాయను గౌరీ దేవిగా భావించి పూజిస్తారు. ఒడిశాలో ఈ రోజు ధాన్య రాశులను కొలవడం ద్వారా ధన, ధాన్యాలకు లోటుండదని భావిస్తారు. ఇతర పండుగ రోజుల మాదిరిగానే ఈ రోజు లక్ష్మీనారాయణుల, శివ పార్వతుల ఆలయాలను అందంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజు రైతుల శ్రేయస్సు కోసం పూజిస్తారు కాబట్టి ఇది రైతుల పండుగ.
తులా సంక్రమణం రోజున బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కూరగాయలు, పెసరపప్పు, బెల్లం దానమిస్తే పుణ్య ఫలితాలు కలుగుతాయని చెబుతారు.
2024: అక్టోబరు 17.
Comments
Post a Comment