Magha Puranam Telugu: మాఘ పురాణం 5వ అధ్యాయం- ఓ కప్ప అందమైన అమ్మాయిగా మారిన కథ - HINDU DHARMAM

Latest Posts

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, February 2, 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 5వ అధ్యాయం- ఓ కప్ప అందమైన అమ్మాయిగా మారిన కథ

శివపార్వతుల సంవాదం

కైలాసంలో పరమ శివుడు పార్వతితో 'పార్వతీ! అశ్వత్థ వృక్షం తొర్రలో నుంచి బయటపడిన కప్ప సుందరాంగిగా మారడం చూసి గౌతమ మహర్షి ఆశ్చర్యంతో ఆమె వృత్తాంతం గురించి వివరించమని కోరగా ముని కాంత అయిన ఆ సుందరాంగి ఇలా చెప్పడం మొదలు పెట్టింది" అని చెబుతూ శివుడు మాఘ పురాణంలో ఐదవ అధ్యాయాన్ని మొదలు పెట్టాడు.

మునికాంత పూర్వజన్మ వృత్తాంతం

మునికాంత గౌతమునితో "మహర్షి! నేను పూర్వజన్మలో జ్ఞానసిద్ధి అనే ముని కుమార్తెను. ప్రజ్ఞాముని భార్యను. మేము కావేరి నది తీరంలో ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తూ ఉండేవాళ్ళం. నా భర్త సమస్త ధర్మములు తెలిసినవాడు. గొప్ప ఆత్మజ్ఞాని. అతను ప్రతినిత్యం కావేరి నదిలో స్నానం చేస్తూ తపస్సు చేసుకుంటూ ధర్మాచరణ చేసేస్తుండేవాడు.

తన భార్యను మాఘ వ్రతం చేయమని కోరిన ప్రజ్ఞాముని

ఇంతలో మాఘమాసం వచ్చింది. నా భర్త ప్రతిరోజూ కావేరి నదిలో మాఘ స్నానం చేస్తూ మాఘమాసానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన నన్ను కూడా మాఘ స్నానానికి రమ్మని పిలిచాడు. మాఘ స్నానం చేసి నది ఒడ్డున శ్రీహరిని ధూప దీపాలతో, ఫల పుష్పాలల్తో అర్చించి మధుర పదార్థాలు నివేదించి నది ఒడ్డునే మాఘ పురాణం శ్రవణం చేయమని నన్ను ప్రోత్సహించాడు. మాఘ మాసం మొత్తం ఈ విధంగా శ్రీహరిని పూజించి పురాణ శ్రవణం చేస్తే కోటి యజ్ఞ ఫలితం లభిస్తుందని, శాశ్వత ముక్తి లభిస్తుందని నా భర్త ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు.

మాఘ వ్రతాన్ని హేళన చేసిన ముని పత్ని

నా భర్త చెప్పిన మాటలు వినకుండా నేను మాఘమేమిటి? స్నానమేమిటి? ఈ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా? నేను సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే వరకు ఆశ్రమం నుంచి బయటకే రాలేను. అలాంటిది సూర్యోదయంతో చల్లని నది నీటిలో స్నానం ఎలా చేస్తాను? మీరు చెప్పిన కర్మ విశేషములను చేస్తే చలితో నేను మరణిస్తాను అంటూ మాఘ స్నానాన్ని చులకన చేస్తూ మాట్లాడాను.

భార్యను శపించిన ప్రజ్ఞాముని

నా మాటలకు ఆగ్రహంతో అంతటి శాంత స్వభావుడైన నా భర్త నన్ను శపించాడు. ధర్మాన్ని అతిక్రమించిన కుమారుని, దుర్భాషలాడు భార్యను, బ్రాహ్మణ ద్వేషుడైన రాజును తక్షణమే శపించాలన్న నియమాన్ని అనుసరించి నా భర్త నన్ను కృష్ణవేణి నదీతీరంలో నీరు లేని అశ్వత్థ వృక్షం తొర్రలో కప్పలా పడి ఉండమని శపించాడు. నీరు లేకుంటే కప్ప జీవనం ఎంతో కష్టం కదా! నా పొరపాటుకు చింతించి నా భర్తను శాపోపశమనం చెప్పని ప్రార్థించగా ఆయన ఎప్పుడైతే కృష్ణవేణి నదీ తీరంలో మాఘ శుద్ధ దశమి రోజు గౌతమ ముని చేసే మాఘ వ్రతాన్ని చూసి మాఘ పురాణం శ్రవణం చేయడం వలన నా కప్ప రూపం పోయి మామూలు రూపం వస్తుందని తెలిపాడు. ఈ రోజు మీరు చేసిన మాఘ వ్రతాన్ని చూసిన పుణ్యానికి నా అసలు స్వరూపం వచ్చిందని గౌతమునికి చెబుతూ నమస్కరించింది మునిపత్ని.


ముని పత్ని చెప్పిన మాటలు విన్న గౌతముడు చిరునవ్వు నవ్వుతూ పతివ్రత అయిన స్త్రీ భర్త మాటలను అతిక్రమించరాదు. చలికి భయపడి మాఘ స్నానం చేయకుండా నీ భర్త మాటలను అతిక్రమించి మహాపరాధం చేశావు కాబట్టి నీవు కప్ప రూపంలో పడి ఉండాల్సి వచ్చింది. ఇప్పటికైనా కృష్ణవేణి నదిలో మాఘ స్నానం చేసి నీ పాప పరిహారం చేసుకో అన్న గౌతముని మాటలకు ఆ మునిపత్ని కృష్ణా నదిలో మాఘ స్నానం చేసి పునీతురాలైంది. కైలాసంలో శివుడు పార్వతితో "పార్వతి వినుము! కృష్ణా నదిలో మాఘ స్నానం చేసి శ్రీహరిని ఆరాధించిన పుణ్యానికి ఆ మునిపత్ని శాశ్వత వైకుంఠవాసాన్ని పొందింది. ఇదే మాదిరి మాఘ మాసంలో దైవవశాత్తు కేవలం ఒకసారి మాఘ స్నానం చేసిన ఫలానికి ఒక శూద్ర దంపతులు ఏ విధంగా సద్గతులు పొందారో ఆరవ అధ్యాయంలో తెలుసుకుందామంటూ" శివుడి ఐదో రోజు అధ్యాయాన్ని ముగించాడు.

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! పంచమాధ్యాయ సమాప్తః  

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages