Kamakhya Devi Temple: శ్రీ కామాఖ్యాదేవి ఆలయం
కామాఖ్యాదేవి క్షేత్రంలో అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం వెనుక పురాణగాథను తెలుసుకుందాం.
ఆలయ పురాణ గాథ
సతీదేవి తండ్రి దక్షప్రజాపతి. దక్షుడు పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన సతీదేవిని అవమానిస్తాడు. యజ్ఞంలో శివనింద జరగడం సహించలేని సతీదేవి యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. శివుడు విరాగిలా మారి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు.
సుదర్శన చక్రంతో ఖండించిన విష్ణువు
ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. ఆలా అమ్మవారి శరీరభాగాలు పడిన ప్రాంతాలన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి.
అత్యంత మహిమాన్విత కామాఖ్యా క్షేత్రం
అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూలకారణమైన జన్మ స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఆలయ స్థల పురాణం
పూర్వం కూచ్ బెహర్ రాజా విశ్వసింహ్ ఒక యుద్ధంలో అయిన వాళ్లందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచలంపైకి వస్తాడు. దగ్గరలో కనిపించే మట్టిదిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. రాజు వెంటనే తన ఆ మట్టిదిబ్బను ప్రార్ధించి అనుచరులంతా తిరిగి రావాలని కోరుకోగానే వారంతా తిరిగి వస్తారు. తన రాజ్యంలో కరవు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది.
తేనెపట్టు ఆకారంలో గోపురాలు
విశ్వసింహ్ ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు. పరమేశ్వరుడు కూడా నీలాచలానికి తూర్పు వైపు బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉమానంద భైరవునిగా దర్శనమిస్తాడు.
ఆలయ నిర్మాణ చరిత్ర
కూచ్ బెహర్ రాజవంశానికి చెందిన చిలరాయ్ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతకుముందే అక్కడ ఉన్న ఆలయాన్ని కాలపహార్ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయటంతో చిలయ్‌రాయ్ పునర్నిర్మించారు. తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదం కారణంగా ఆలయ ప్రవేశ అర్హత కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లోకి కూడా ప్రవేశించరు.
ఈ ఆలయ నిర్మాణం నాలుగు గదులుగా ఉంటుంది. తూర్పు నుంచి పశ్చిమానికి మొదటి మూడు, మండపాలు కాగా చివరిది గర్భగుడి. అద్భుతమైన శిల్ప కళాఖండాలతో, తేనెతుట్ట ఆకారంలో ఉన్న శిఖరంతో ఆలయం నిర్మించి ఉంటుంది. మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు.
ప్రదక్షిణలు తప్పనిసరి
ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణ చేయకపోతే దర్శనఫలం దక్కదని భక్తుల నమ్మకం. సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడాఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు.
పూజలు - ఉత్సవాలు
ఏటా వేసవిలో మూడురోజుల పాటు అంబుబాచీ పండుగ సందర్భంగా కామాఖ్యదేవి రజస్వల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. పూజారులు కూడా గుడిలోపలికి వెళ్లరు. నాలుగో రోజు లక్షలమంది భక్తుల సమక్షంలో తలుపులు తెరుస్తారు. ఆ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎరుపురంగులో ఉంటుంది. నవరాత్రి సమయంలో ఐదు రోజుల పాటు ఇక్కడ దుర్గా ఉత్సవాలతో పాటు భాద్రపదమాసంలో మానస పూజ నిర్వహిస్తారు. ఆ సమయంలో జంతుబలులు నిషేధం.
ఎలా చేరుకోవాలి
దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గువాహటికి విమాన సదుపాయం ఉంది. విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, గువాహటి రైల్వేస్టేషన్ నుంచి 6 కి.మీ దూరంలో కామాఖ్యదేవి ఆలయం ఉంది.
మోక్షకారకమైన కామాఖ్యా అమ్మవారిని జీవితంలో ఒక్కసారైన తప్పకుండా దర్శించాలని పురాణాలూ చెబుతున్నాయి
Comments
Post a Comment