Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 25 వ అధ్యాయం
పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నారదుడు అంబరీషునికి చెబుతున్న వైశాఖ పురాణం నిరంతరాయంగా కొనసాగుతోంది. వైశాఖ పురాణం 25 వ అధ్యాయంలో శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖుడు కిరాతుల సంభాషణను ఈ విధంగా వివరించసాగాడు.
కిరాతుడు శంఖమునుల సంవాదం
కిరాతుడు శంఖునితో "స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు ఆచరిస్తూ భిన్న స్వభావులై ఉండడానికి గల కారణాలు వివరించండి" అని అడుగగా శంఖుడు ఈ విధంగా చెప్పసాగాడు.
జీవుల స్వభావ భేదాలను వివరించిన శంఖుడు
శంఖుడు కిరాతునితో "ఓ కిరాతా! సత్వ, రజో, తమో గుణాలను అనుసరించి జీవులు ఏర్పడ్డారు. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. జీవులు తాము చేసిన కర్మల ఫలితంగా పాపపుణ్యాలను అనుభవిస్తారు.
తామస గుణ స్వభావులు
తామస బుద్ధితో ఉన్నవారు అనేక పాపాలు చేసి దుఃఖంతో రాక్షస, పిశాచాలుగా జన్మిస్తుంటారు.
రజోగుణ స్వభావులు
రజోగుణ స్వభావం కలవారు మిశ్రమబుద్దితో పుణ్యపాపములను రెండిటిని చేయుచుందురు. పుణ్యము ఎక్కువగా చేస్తే స్వర్గమును, పాపాలు ఎక్కువైతే నరకాన్ని పొందుచున్నారు. కావున నీరు నిశ్చయ జ్ఞానము లేనివారై, మంద భాగ్యులై సంసారచక్రమున భ్రమించుచుందురు.
సాత్విక గుణ స్వభావులు
సాత్వికులైన వారు ధర్మశీలురై, దయాగుణ,విశిష్టులై, ధర్మ కార్యాల పట్ల శ్రద్ద కలిగినవారై ఇతరులను చూసి అసూయపడనివారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉంటారు. వీరిపట్ల శ్రీహరి దయాళుడై ఉంటాడు. అందరికీ ప్రభువగు శ్రీహరి జీవుల గుణకర్మల ప్రకారం వారికి సుఖదుఃఖాలు ఇస్తుంటాడు.
శ్రీహరికి అందరూ సమానమే!
సర్వాంతర్యామి అయిన ఆ శ్రీహరికి అన్ని జీవులు సమానమే! ఒకరి పట్ల ప్రేమ, మరొకరి పట్ల ద్వేషం శ్రీహరికి ఉండనే ఉండవు. జీవులు చేసిన కర్మలను అనుసరించి వారికి ఆయా ఫలితాలు ఉంటాయి కానీ శ్రీహరి దృష్టిలో అందరూ సమానమే!
విత్తనాన్ని అనుసరించే చెట్టు
ముళ్ల చెట్టు విత్తనం వేసి పళ్లు రావాలంటే రావు కదా! అలాగే పాపాలు చేసి పుణ్యలోకాలు కావాలంటే కుదరదు కదా!" అని అని శంఖుడు కిరాతునికి వివరించెను.
ముక్తి సాధన గురించి ప్రశ్నించిన కిరాతుడు
కిరాతుడు శంఖునితో "స్వామి! సాత్విక గుణాలతో ధర్మ మార్గంలో పయనిస్తూ శ్రీహరిని ఆశ్రయించి ఉండేవారికి సృష్టిస్థితిలయములలో ముక్తి ఎప్పుడు కలుగుతుందో వివరించండి" అని అడుగగా శంఖుడు ఇలా చెప్పసాగాడు.
బ్రహ్మకల్పం
భూలోకంలో నాలుగువేల యుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు. మరో నాలుగువేల యుగాల కాలం రాత్రిగా గణిస్తారు. ఇట్టి ఒక రాత్రి, ఒక పగలు బ్రహ్మకు ఒక దినము. ఇటువంటి పదిహేను రోజులు ఒక పక్షం. రెండు పక్షములు ఒక మాసము. రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక ఆయనము. రెండు ఆయనములు ఒక సంవత్సరము. ఇట్టి దివ్య సంవత్సరములు నూరైనచో దానిని బ్రహ్మకల్పమందురు. ఒక బ్రహ్మకల్పము ముగిసిపోగానే ప్రళయమేర్పడును. ఈ ప్రళయకాలంలో జీవులు తమ తమ పాపపుణ్యాలను అనుసరించి స్వర్గలోకం, విష్ణు లోకం, నరకానికి పోతారు. పాపాలు మిగిలితే తిరిగి జన్మించి ఆ పాపఫలాన్ని అనుభవిస్తారు. ఇది సాధకులు ముక్తిని పొందే క్రమం" అని శంఖుడు వివరించాడు.
భాగవత ధర్మాలు బోధించామని కోరిన కిరాతుడు
కిరాతుడు శంఖునితో "స్వామి! శ్రీహరికి ప్రీతికరమైన భాగవత ధర్మాలు తెలిజేయుము" అని కోరగా శంఖుడు సంతోషించి ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు.
శ్రీహరి మెచ్చిన భాగవత ధర్మాలు
చిత్తశుద్దిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. బ్రాహ్మణాది వర్ణములచేత, బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నాలుగు వర్ణములవారును తమ తమ శక్తికొద్దీ ఆయా ధర్మాలను ఆచరించి ఆ ఫలాన్ని శ్రీహరికి సమర్పించినచో వాటిని సాత్విక ధర్మాలని అంటారు.
ఎవరు భాగవతులు?
శ్రీ మహావిష్ణువు తరువాత భాగవతులను అంతటి దైవంగా భావిస్తారు. ఎవరి మనసు ఎల్లప్పుడూ విష్ణువుపై ఉంటుందో, ఎవరి నాలుకపై సదా శ్రీహరి నామోచ్ఛారణ ఉండునో, ఎవరి హృదయము ఎల్లప్పుడూ విష్ణుపాదముల పట్ల నిమగ్నమై ఉండునో వారే భాగవతులు. భాగవతులకు ప్రాపంచిక భోగాల పట్ల ఆసక్తి ఉండదు. ఇహపరలోకమును కలిగించు విష్ణుప్రీతికరములగు గుణములు సర్వదుఃఖములను నశింపజేయును.
ఉత్తమోత్తమమైన వైశాఖ ధర్మాలు
పెరుగును చిలికితే వెన్న ఎలాగైతే వస్తుందో అలాగే అన్ని ధర్మాల సారమే వైశాఖ ధర్మాలు. ఒక్క వైశాఖ ధర్మాలు ఆచరిస్తే ఇక ఎలాంటి ధర్మాలు ఆచరించాల్సిన అవసరమే ఉండదు. ఇది శ్రీహరి ఇచ్చిన వరం.
సజ్జనులు ఆచరించాల్సిన వైశాఖ ధర్మాలు
- వైశాఖ మాసంలో వేసవి తాపాన్ని తీర్చే వైశాఖ ధర్మాల గురించి శంఖుడు కిరాతునికి ఈ విధంగా వివరించాడు.
- బాటసారులకు నీడ నిచ్చే మండపాలు ఏర్పాటు చేయుట.
- చలివేంద్రాలు ఏర్పాటు చేయుట
- వేసవిలో అలిసిన బ్రాహ్మణులకు విసనకర్రలతో విసిరి సేదతీర్చుట
- గొడుగు, చెప్పులు, గంధం, చందనం దానమిచ్చుట
- బాటసారుల దాహార్తిని తీర్చే చెరువులు, బావులు తవ్వించుట
- వేసవి సాయంకాల సమయాలలో బ్రాహ్మణులకు దోసపండ్లు, చెరుకు గడలు, తేనే, పానకం, తాంబూల దానం ఇచ్చుట.
- కొబ్బరినీళ్లు, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకిచ్చుట
- పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుట
- ప్రాతఃకాలమున నదీస్నానం చేసి, సంధ్యావందనాదులు ఆచరించి, శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములు చేయవలెను.
- పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ఈ వైశాఖ ధర్మాలు ఆచరించిన వారి జన్మాంతర పాపాలు నశించి విష్షులోకాన్ని చేరుతారు.
విశిష్ట ధర్మం
శ్రీహరి ప్రీతి కోసం వైశాఖమాసమంతా వ్రతము ఆచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతి దినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను నూతన వస్త్రములతో, దక్షిణలతో యధాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు సమర్పించాలి. వైశాఖ బహుళ ద్వాదశినాడు పెరుగు కలిపిన అన్నమును, జలకలశమును తాంబూల దక్షిణలను యిచ్చిన యమ ధర్మరాజు సంతసించి అకాల మృత్యు దోషాలను పోగొడతాడు.
ఇవి నిషిద్ధం
వైశాఖ మాసంలో ఉల్లి, సొరకాయ, వెల్లుల్లి, నేతిబీరకాయ బచ్చలకూర, ములగకాడలు పండని, వండని పదార్థములు, ఉలవలు, చిరుశెనగలు తినరాదు.
ఇవి తప్పక చేయాలి
పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి యిచ్చిన పితృదేవతలు సంతసింతురు. వైశాఖవ్రతము నాచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును, శ్రీహరి లోకమును చేరుదురు. ఈ విధంగా శంఖుడు కిరాతునకు వైశాఖధర్మములను వివరించుచుండగా అకస్మాత్తుగా అయిదు కొమ్మలు గల మఱ్ఱిచెట్టు నేలకూలడంతో అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టుతొఱ్ఱలో నుంచి పెద్దశరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి ఇక్కడవరకు చెప్పిన ఈ కథను నారదుడు అంబరీషునకు చెబుతూ వైశాఖ పురాణం ఇరవై ఐదవ అధ్యాయాన్ని ముగించాడు. వైశాఖ పురాణం ఇరవై ఐదో అధ్యాయం సమాప్తం
Comments
Post a Comment