Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 24 వ అధ్యాయం

 శంఖముని కిరాతునికి వివరించిన విష్ణువు మహత్యాన్ని శ్రుతదేవ మహాన్ముని శ్రుతకీర్తి మహారాజుకు ఎలా వివరించాడో నారద అంబరీషుల సంవాదం ద్వారా ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం

శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో "ఓ రాజా! కిరాతుడు కోరినట్లుగా శంఖముని విష్ణువు మహత్యాన్ని వివరించిన తీరును చెబుతాను శ్రద్ధగా వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.

విష్ణు మహత్యాన్ని చెప్పమని కోరిన కిరాతుడు

వైశాఖమాస ధర్మాలను బోధించిన శంఖమునితో కిరాతుడు "ఓ మహానుభావా! వైశాఖ మాసంలో విష్ణువు పూజించడం, వైశాఖ ధర్మాలు పాటించడం ఉత్తమమని చెప్పారు కదా! అసలు ఇంతకూ ఆ విష్ణువు ఎటువంటి వాడు? అతని లక్షణాలు ఏమి? అతనిని ఎలా కనుగొనాలి?" అని ప్రశ్నిస్తాడు.

శంఖుడు వివరించిన విష్ణు మహత్యం

కిరాతుని మాటలకు శంఖుడు "ఓ కిరాతుడా! శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి. నారాయణుడు నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానందరూపుడు. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని భావిస్తారు. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, యితిహాసములు ద్వారా నారాయణుని ఉనికిని తెలుసుకొనవచ్చును. శ్రీహరి సర్వశక్తిసంపన్నుడు.

శ్రీహరియే ప్రాణాధారం

ఇంద్రునికంటె గిరిజాదేవి, ఆమెకంటె జగద్గురువగు శివుడు, శివునికంటె మహాదేవియగు బుద్ది, బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. ప్రాణమే సర్వాధారం. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. అటువంటి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని దయచేతనే ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది వేరొకటి లేదు" అన్న శంఖుని మాటలకు కిరాతుడు ప్రాణముకంటె విష్ణువు ఏ విధంగా గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.

దేవతలకు అధిపతిగా బ్రహ్మను నియమించిన శ్రీహరి

పూర్వం శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో "దేవతలారా! మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా నియమించుచున్నాను. మరి యువరాజుగా నియమించడానికి ఎవరికి అర్హత ఉందో, ఎవరు గొప్పవారో మీలో మీరే నిర్ణయించుకోండి" అని చెబుతాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఎవరికి వారు యువరాజు పదవికి తమకంటే గొప్పవారెవరు లేరని వారిలో వారు కలహించుకోసాగారు. చివరికి వారందరూ శ్రీహరిని ఆశ్రయిస్తారు.

యువరాజు అర్హతలను వివరించిన శ్రీహరి

దేవతల మాటలకు శ్రీహరి చిరునవ్వుతో "విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము చాలమంది దేవతలు అంశల స్వరూపము. ఏ దేవుడు ఏ దేవుని అంశ యీ శరీరము నుంచి బయటకు వచ్చిన యీ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించిన లేచునో అతడే, ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.

ప్రాణమే యువరాజు

శ్రీహరి చెప్పినట్లు స్థూలదేహంలో ప్రాణం ప్రవేశించగానే ఆ శరీరంలో చైతన్యం కలిగెను. దానితో ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే అన్నింటికంటే అధికమని రుజువయింది.

ప్రాణమే సర్వధారం

ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది వేరొకటి లేదు. ప్రాణదేవత సర్వదేవాత్మకము! నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున ఉండును.

కిరాతుని సందేహం

శంఖుని మాటలు విన్న కిరాతుడు "స్వామి! ప్రాణం ఇంత గొప్పదైతే అది ఎందుకు ప్రసిద్ధి కాలేదు? వివరించండి!" అని కోరగా శంఖుడు ఇలా చెప్పెను.

ప్రాణమహాపురుషునికి శాపమిచ్చిన కణ్వ మహాముని

పూర్వం ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపస్సు చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము కలిగించిన ప్రాణపురుషుని చూసి "అందరికంటే గొప్పవాడని గర్వంతో నీవు నా తపస్సుకు భంగం కలిగించావు కాబట్టి నీకు ముల్లోకాలలో ప్రసిద్ధి ఉండదు, భూలోకంలో మరింతగా ప్రఖ్యాతి ఉండదు.. శ్రీహరి అవతారాలు ప్రసిద్ధం అవుతాయి కానీ నీవు మాత్రము ప్రసిద్దుడవు కాలేవు" అని శపిస్తాడు.

శంఖుడు కిరాతునితో "కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. అందుకే ముల్లోకాలలో, భూలోకంలో కూడా శ్రీ మహావిష్ణువే శ్రేష్ఠుడు అని చెబుతాడు. నీకు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలని ఉంటే నిస్సందేహంగా అడుగుము" అని శంఖుడు కిరాతునికి చెబుతాడు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు చెప్పిన ఈ కథను నారదుడు ఇక్కడవరకు చెప్పి వైశాఖ పురాణం ఇరవై నాలుగో అధ్యాయాన్ని ముగించాడు.

 వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి