Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 23 వ అధ్యాయం
ఆ శ్రీహరి అనుగ్రహముతో వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో శంఖుడు తెలిపిన కిరాతుని పూర్వజన్మ వృత్తాంతం గురించి శృతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
నారద అంబరీషుల సంవాదం
శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుకు శంఖకిరాతుల వృత్తాంతము వివరించిన విధానాన్ని నారదుడు అంబరీష మహారాజుకు ఈ విధంగా చెప్పసాగాడు.
కిరాతుని పూర్వజన్మ వృత్తాంతం
కిరాతుడు శంఖుని చూసి "ఓ మహానుభావా! దుష్టుడను నాకు నీ అనుగ్రహం కలిగింది. అసలు కిరాతుడనైన నాకు ఇలా పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కలగడానికి కారణమేమి? నీ సాంగత్యం కోరి, నిన్ను సదా సేవించాలన్న నా కోరికను మన్నించి నన్ను శిష్యునిగా స్వీకరింపుము" అన్న కిరాతుని మాటలకు శంఖుడు ఆశ్చర్యపోయి ఇదంతా వైశాఖ మహిమ అని తలచి కిరాతునితో ఇట్లు పలికాడు.
శంఖుడు కిరాతునితో చల్లని ప్రదేశానికి పోవుట
శంఖుడు కిరాతునితో "ఓ కిరాతుడా! సంసార సాగరాన్ని దాటించే విష్ణు ప్రీతి కలిగించే వైశాఖ ధర్మాలను ఆచరింపుడు. ఇవి ఆచరణలో చాలా సులభమైనను, ఫలితం మాత్రం అనంతం. ఈ ఎండ నన్ను మిక్కిలి బాధించుచున్నది. ఇక్కడ నీరు, నిలువ నీడ లేవు. అవి ఉన్న ప్రదేశానికి పోదాం. అక్కడకు వెళ్లి చల్లని నీటిని తాగి సేదతీరి నీకు వైశాఖ ధర్మాలను బోధిస్తాను" అని శంఖుడు పలికెను.
శంఖుని సేద తీర్చిన కిరాతుడు
శంఖుని మాటలు విన్న కిరాతుడు "స్వామి! ఇక్కడకు కొంచెం దూరంలో స్వచ్చమైన నీరున్న సరస్సుకలదు. అచట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండిన వెలగ చెట్లు చాల ఉన్నాయి. ఆ ప్రదేశంలో మీరు చక్కగా సేద తీరవచ్చు. అక్కడకు పోదాం" అని చెప్పి వారిద్దరూ కలిసి ఆ ప్రదేశానికి చేరుకుంటారు.
కిరాతునికి శంఖుని బోధ
కిరాతుడు శంఖుని తీసుకెళ్లిన ప్రదేశంలో జలపక్షులు, కొంగలు, చేపలు నివసించే స్వచ్ఛమైన నీరున్న సరస్సు ఉంది. ఆ సరస్సు ఒడ్డున వెదురు వృక్షాలు, చక్కని లతలున్న పొదరిళ్లు, ఫలపుష్పాలతో కూడిన అనేక వృక్షాలున్నాయి. ఇట్టి మనోహరమైనసరస్సు చూడగానే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యెను. శరీరము సేదతీరినట్లయ్యెను. శంఖుడు మనోహరమగు ఆ సరస్సులో స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునకిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తముతో ఆ కిరాతుని దయాద్రుష్టితో చూసి,"ఓ కిరాతుడా! నీకు ఎటువంటి ధర్మాలను ఉపదేశించను? ఆచరణలో సులభం, పుణ్యం అనంతమైన వైశాఖ ధర్మాలను ఉపదేశించనా?" అని అడుగగా అప్పుడు ఆ కిరాతుడు "స్వామి! నాకు ఇతరులను హింసించి బ్రతికే ఈ కిరాత జన్మ కలగడానికి కారణమేమి? దయచేసి తెలుపుము" అని ప్రార్ధిస్తాడు.
శంఖుని దివ్యదృష్టి
కిరాతుని మాటలకు శంఖుడు కొంతసేపు ధ్యానమగ్నుడై తన దివ్యదృష్టితో కిరాతుని పూర్వజన్మ గురించి తెలుసుకుని ఈ విధంగా చెప్పసాగెను.
కిరాతుని పూర్వజనం వృత్తాంతం
"ఓ కిరాతుడా! నీవు పూర్వజన్మలో స్తంభుడను బ్రాహ్మణుడవు. వేద శాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యపై మనసుపడి బ్రాహ్మణ ఆచారాదులను విడిచి, ఆచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్య నీకును ఆ వేశ్యకును పతిభక్తితో సేవలు చేస్తుండేది.
ఒకనాడునీవు బ్రాహ్మణులు భుజించే సాత్విక ఆహారాన్ని విడిచి నిషిద్ధమైన ఆహారాన్ని భుజించడం వల్ల నీకు భయంకరమైన రోగం వచ్చింది. రోగంతో పాటు ఐశ్వర్యం కూడా నశించి దరిద్రుడవైన నిన్ను ఆ వేశ్య విడిచి వెళ్లిపోయింది. కానీ పతివ్రత అయిన నీ భార్య మాత్రం నీకు నిరంతరం సేవలు చేస్తుండేది. చేసిన పాపాలకు పశ్చాత్తాపంతో రగిలిపోతున్న నిన్ను నీ భార్య ఊరడించింది. తన పుట్టింటి నుంచి ధనం తెప్పించి నీకు సేవ చేస్తుండేది. నీ ఆరోగ్యం కోసం ఎందరో దేవతలకు ఎన్నో మొక్కులు మొక్కింది.
ఒకనాడు దేవలుడను ముని మీ ఇంటికి రాగా నీ భార్య అతనిని వైద్యునిగా నీకు పరిచయం చేసింది. ధర్మకార్యాల పట్ల ఆసక్తి లేని నీకు అతడు ముని అని తెలిస్తే సేవలు చేయవని తలచి నీకు అతడు వైద్యుడని చెప్పెను. ఆ మునికి నీ చేత పానకము ఇప్పించెను. తదుపరి ఆమె కూడా మునికి పానకం ఇచ్చి సకలోపచారాలు చేసెను. మరుసటి రోజు ముని తన దారిన తాను పోయెను. నీకు రోగ తీవ్రత ఎక్కువై మరణిస్తే నీ భార్య తన చేతికున్న ఆభరణాన్ని అమ్మి నీకు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసి ఆ చితిలో ఆమె కూడా నీతో కలిసి సహజీవనం చేసింది.
తాను పాటించిన పతివ్రతా ధర్మాలకు నీ భార్య విష్ణులోకమును చేరెను. దేవలునికి వైశాఖ మాసంలో పానకం ఇవ్వడం వలన ఆమెకు విష్ణు సాయుజ్యం కలిగింది. నీవు మరణ సమయంలో కూడా నీకు సేవలు చేసిన నీ భార్యను కాకుండా, నీచురాలగు వేశ్యను తలుచుకోవడం వలన నీకు ఈ కిరాతుని జన్మ కలిగింది. అయితే వైశాఖ మాసంలో నీ భార్య ముని శ్రేష్ఠుడైన దేవలునికి నీ చేత పానకం ఇప్పించిన పుణ్యానికి ఈ రోజు ఇలా వైశాఖ ధర్మాలు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ప్రతి సంవత్సరం నేను నిష్టగా వైశాఖ వ్రతం ఆచరించడం వలన దివ్యదృష్టితో నీ పూర్వజన్మ తెలుసుకోగల శక్తి కలిగింది" అని శంఖుడు కిరాతునికి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని విశదీకరించాడు.
శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పిన ఈ కథను నారదుడు అంబరీషునకు వివరిస్తూ వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయాన్ని ముగించాడు.
వైశాఖ పురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం.
Comments
Post a Comment