Vaishaka Puranam Telugu: వైశాఖ పురాణం 22 వ అధ్యాయం
పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో శ్రుతదేవ మహాముని వివరించిన శంఖుడనే బ్రాహ్మణుని కథను నారద అంబరీషుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుల సంవాదం
శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవ మహామునితో "మహామునీ! యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖ మహిమల గురించి ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు వైశాఖ ధర్మములను వివరింపగోరుచున్నాను" అని ప్రార్థించెను. ఆ మాటలకూ శ్రుతదేవ మహాముని సంతోషించి "ఓ రాజా! వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము" అంటూ ఈ విధంగా చెప్పసాగెను.
శంఖుడు కిరాతుల వృత్తాంతం
పూర్వం పంపానది తీరంలో శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండ వేడికి తాళలేక బాధితుడై మధ్యాహ్న సమయమున ప్రయాణ శ్రమతో అలిసిపోయి ఒక చెట్టు నీడలో కూర్చుండెను.
బ్రాహ్మణుని దోచుకున్న కిరాతుడు
అదే సమయంలో ఆ అడవిలో దారికాచి జనాలను దోచుకునే ఒక కిరాతుడు అక్కడకు వస్తాడు. బ్రాహ్మణుని చూసి ఆ కిరాతుడు క్రూరముగా అతని వద్ద ఉన్న పాదరక్షలు, గొడుగు, కమండలం, రత్నకుండలములను దోచుకున్నాడు. అశక్తుడైన ఆ బ్రాహ్మణుడు ఏమీ చేయలేక అక్కడ నుంచి బయలుదేరి నెమ్మదిగా వెళ్లసాగాడు.
బ్రాహ్మణునిపై జాలి చూపించిన కిరాతుడు
ఓ వైపు ఎండ వేడికి కాళ్లు కాలుతుంటే చెట్టు నీడ ఉన్నచోటులో నడుచుకుంటూ వెళుతున్న ఆ బ్రాహ్మణుని చూసి కిరాతునికి జాలి కలుగుతుంది. ఆ కిరాతుడు బ్రాహ్మణుని వద్ద నుంచి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. 'సుఖీభవ!' అని ఆ కిరాతుని ఆశీర్వదిస్తూ "నీ పుణ్యం పరిపక్వమైనది! నీవు వైశాఖ ధర్మాలు పాటించడం వలన నీకు శ్రీహరి అనుగ్రహం కలిగింది. ఎండ వేడి నుంచి నాకు ఉపశమనం కలిగించినందుకు నీవు సుఖంగా ఉండుము" అని ఆశీర్వదిస్తాడు.
ఆశ్చర్యపోయిన కిరాతుడు
శంఖుని మాటలు విని కిరాతుడు ఆశ్చర్యపోతాడు. బ్రాహ్మణునితో "నీ నుంచి దొంగిలించిన నీ పాదుకలు నీకు ఇచ్చినంత మాత్రాన నాకు పుణ్యం ఎలా కలుగుతుంది? వైశాఖ ధర్మాలతో నా పట్ల శ్రీహరి సంతృప్తి చెందాడని అంటున్నావు? ఇదెలా సాధ్యం? నాకు వివరంగా చెప్పుము" అని కోరెను.
కిరాతునికి వైశాఖ ధర్మాలు వివరించిన శంఖుడు
శంఖుడు కిరాతునితో "నీవు దోచుకున్న తర్వాత అది నీ సొత్తే అవుతుంది. వైశాఖ మాసంలో ఎండకు బాధ పడుతున్న బ్రాహ్మణునికి పాదరక్షలు అందించి ఉపశమనం కలిగించడం ద్వారా నీవు తెలియకుండానే వైశాఖ ధర్మాలు ఆచరించావు. వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖ మాస ధర్మాలు పాటించిన నీ పట్ల శ్రీహరి అనుగ్రహమే కారణం. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. గంగాది నదులలో, ప్రయాగాది తీర్ధాలలో స్నానం చేసినను రాని పుణ్యం వైశాఖ ధర్మాలు ఆచరించడం వలన కలుగుతుంది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగుట నిశ్చయము" అని శంఖుడు కిరాతునికి వైశాఖ ధర్మాల గురించి వివరించెను.
శాపవిమోచనం పొందిన సింహం ఏనుగు
శంఖుడు కిరాతునికి వైశాఖ ధర్మాల గురించి వివరిస్తున్న సమయంలో ఒక సింహం పులిని చంపడానికి దానిని తరుముతూ వచ్చి మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. ఆ సింహానికి ఏనుగుకు భీకరమైన పోరాటం జరుగుతుంది. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పు మాటలను వినుట జరిగెను. సింహం, ఏనుగు వైశాఖమహిమను వినడం వలన వాటి గజసింహరూపములను విడిచి దివ్యరూపముల పొందాయి. వారిని తీసుకొని పోవడానికి దివ్యములైన విమానములు వచ్చి నిలుచున్నాయి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.
గజ సింహాల పూర్వజన్మ వృత్తాంతం
తమకు నమస్కరిస్తున్న దివ్యరూపాలలో ఉన్న పురుషులను చూసి శంఖుడు కిరాతుడు ఆశ్చర్యపోయి "ఓ మహానుభవులారా! మీరెవరు? మాకెందుకు నమస్కరిస్తున్నారు?" అని ప్రశ్నిస్తారు. అప్పుడు వారిద్దరూ "మేము మతంగ మహర్షి పుత్రులము. మా పేర్లు దంతిలుడు, కోహలుడు. సకల విద్యలు నేర్చి, యవ్వనంలో ఉన్న మమ్మల్ని చూసి మా తండ్రిగారు "'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. బాటసారులకు విసనకర్రలతో విసిరి సేద తీర్చండి. మార్గమున నీడనిచ్చు మండపముల ఏర్పాటు చేయండి. బాటసారులకు చల్లని నీటిని, అన్నాన్ని ఇవ్వండి. ప్రాతఃకాలమున నదీ స్నానము చేసి శ్రీహరిని పూజించి, వైశాఖ పురాణాన్ని పఠించండి." అని మా తండ్రి చెప్పిన మాటలు మేము వినకుండా నిర్లక్ష్యం చేయడం మా తండ్రికి బాధ కలిగించింది. మా పట్ల కోపంతో మమ్మల్ని సింహం, ఏనుగు జన్మలెత్తమని శపించాడు.
దంతిలుడు, కోహలునికి శాపవిమోచనం
మా తండ్రి ఇచ్చిన శాపానికి భయపడి, పశ్చాత్తాపంతో మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి "కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు కలుసుకొని గొప్ప యుద్ధం చేస్తారు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గురించి మాట్లాడే మాటలను దైవవశాత్తు మీరు వింటారు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను. శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి దివ్యలోకానికి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. మాకు శాపవిమోచనం కలిగించినందుకు కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని చెప్పి" దంతిల కోహిలలు తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్లిపోయిరి.
కిరాతుని విస్మయం
దంతిలుడు, కోహలుడు మాటలు విని కిరాతుడు విస్మయం చెందుతాడు. అప్పుడు శంఖుడు కిరాతునితో "ఓయి! చూసావుగా! వైశాఖమహిమను వినడం వల్లనే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగింది." అని అంటాడు. ఇక అక్కడితో కిరాతునిలో హింసాప్రవృత్తి నశిస్తుంది. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో చెప్పిన ఈ కథను నారదుడు అంబరీష మహారాజుకు వివరిస్తూ వైశాఖ పురాణం ఇరవై రెండో అధ్యాయాన్ని ముగించాడు.
Comments
Post a Comment