Saraswathi Pushkaralu 2025: సరస్వతి నది పుష్కరాలు
సరస్వతీ అతిపురాతనమైన వేదకాలపు నది. ఈ నదీప్రసక్తి వేదాలలోను, రామాయణ భారత, భాగవతాలలోను కనిపిస్తుంది. బ్రహ్మాండపురాణంలో సరస్వతీ నదీ ఆవిర్భావం గురించి ఉంది. పూర్వం పరమశివుని ఆద్యం తాలను కనుక్కోదలచి బయలుదేరిన బ్రహ్మదేవుడు ఎంత వెదకినా కనుక్కోలేకపోయాడు. చివరికు శివుని వద్దకు వచ్చాడు. బ్రహ్మను చూచిన శివుడు నా ఆద్యంతాలు కనుగొన్నావా? అని అడిగాడు. పరాభవం చెందుతానని భావించిన బ్రహ్మ “నీ ఆద్యం తాలు చూచి వచ్చాను" అని అబద్దం చెప్పాడు. ఈ విషయాన్ని గ్రహించిన శివుడు అతడి వాక్కగు సరస్వతిని నదిని కమ్మని శపించాడు. అందువల్లనే విద్యాధిదేవతైన సరస్వతి నదీదేవతగా మారిందని కథనం.
బ్రహ్మవైవర్త, దేవీభాగవత పురాణాలలో గంగ, సరస్వతులు ఒకరినొకరు శపించుకుని భూలోకంలో నదులుగా జన్మించినట్లు కథనం.
మహాభారతంలో సరస్వతీనది పూర్వం బ్రహ్మ చేసిన యాగానికి ‘సుభద్ర' అనే పేరుతో, నైమిశారణ్యంలో మునులు చేసిన యాగానికి 'కనకాక్షి' అనే పేరుతో, గయుడు చేసిన క్రతువుకు ‘విశాల' అనే పేరుతో, ఉద్దాలకుడు చేసిన అధ్వరానికి సురతన్వి' అనే పేరుతో, వశిష్టుడు చేసిన యాగానికి 'ఓఘమాల' అనే పేరుతో, బృహస్పతి చేసిన సత్రానికి 'సువేణి' అనే పేరుతో, బ్రహ్మ చేసిన సవనానికి 'విమలోదక' అనే పేరుతో వచ్చి నిరుపమానమైన గౌరవం పొందినట్లు చెప్ప బడింది. సరస్వతీనది ఈవిధంగా ఏడు యాగాలకు, ఏడు రూపాలతోను, పేర్లతోను వచ్చి గౌరవాదులు పొందడం వల్ల ఆమె 'సప్తసారస్వతం' అనే పేరును పొందింది.
సరస్వతీనదీ ప్రాశస్త్యం
సరస్వతీనదీ ఎంతో పవిత్రమైంది. ఈ నదీస్మరణ వల్లనే సకల పాపాలు శమిస్తాయి. ఈ నదీతీరంలో వందలకొద్దీ తీర్థాలున్నాయి. అవి ఎంతో పుణ్యప్రదమైనవి. చంద్రుడు ఈ నదీస్నానఫలితం వల్ల రాజయక్ష్మవ్యాధిని పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు తన బ్రహ్మహత్యాదోషాన్ని పోగొట్టుకున్నాడు. వరుణునికి జలాధిపత్యం, కుబేరునికి ధనాధిపత్యం ఈ నదీ సేవనం వలననే వచ్చాయి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షికావడానికి కూడా ఈ నదే కారణం. వ్యాసభగవానుడు ఈ నదీతీరంలోనే విజ్ఞానరాశి అయిన వేదవిభజన చేశాడు. భాగవతరచన కూడా చేశాడని పురాణాలు సరస్వతీనదీప్రాశస్త్యాన్ని చెబుతున్నాయి.
ఈ సరస్వతీనదీతీరంలోనే తొలిమానవుడు నడయాడాడు. ఆర్యనాగరికత, ఆర్యుల జీవనం, వేదవిజ్ఞాన సముపార్జనవిస్తరణ ఈ నదీతీరంలోనే కొనసాగాయి. అందుకనే వారిచేత వేదాలలో తమ జీవనానికి కారణమవటం వల్ల తల్లిగా, జ్ఞానసముపార్జన ఈ నదీతీరంలోనే జరగడం వల్ల జ్ఞానదాయినిగా అభివర్ణించారు.
ఋగ్వేదంలో గంగా, యమునా, సింధు ఇత్యాది 21 నదులకన్నా సరస్వతీనదీ చాలా ఎక్కువగా కీర్తించబడింది.
సరస్వతీనదీ గమనం
వేదాలలో ఈ నదీతీరంలో నివసించే రాజుల గురించి, ఋషుల గురించి, ప్రజల గురించి, దీని గమనం గురించి అనేక వర్ణనలున్నాయి. హిమాలయంలో పుట్టే ఈ నది వితస్తా (జీలం), అసిక్నీ (చీనాబ్), పరుష్టి (రావీ), శతద్రు (సట్లేజ్) విపాశ (బీయాస్), సింధునదులతో కలసి (పంజాబ్, పాకిస్తాన్ మీదుగా) ప్రవహించి పశ్చిమ సముద్రంలో సంగమించేది. ఈ ఏడు నదులు కలిసి ప్రవహించిన ప్రదేశమే సప్తసింధుప్రదేశంగా (ఆర్యావర్తంగా) ప్రసిద్ధి చెందింది. సరస్వతీనదీప్రవాహం కొన్నిచోట్ల వేగంగా, కొన్నిచోట్ల మందంగా సాగేది. ఈ నది వెడల్పు కూడా చాలా ఎక్కువగానే ఉండేది. కొన్నిచోట్ల సరోవరంలాగా, చెరువులాగా ఈ నదీప్రవాహం ఉండేది. ఆర్యావర్తం నుండి ఈ సరస్వతీనది గంగాయమునలవద్దకు ప్రవహించి ప్రయాగ అనే పవిత్రపుణ్యస్థలంలో వాటితో అంతర్వాహినిగా కలుస్తుంది. ఇదే ప్రఖ్యాతి చెందిన త్రివేణీ సంగమం.
ఈ సరస్వతీనదీ తీరప్రాంతంలో ఉన్నదే కురుక్షేత్రం. కురుక్షేత్రానికి దగ్గరలోనే ఉన్నది 'వినాశన' అనే ప్రదేశం. ఇక్కడే సరస్వతీనది అంతర్ధానమైంది. ఒక పవిత్రనదిఅంతర్ధానాన్ని చూచిన స్థలం కాబట్టి ఆ చోటుకు 'వినాశన' అనే పేరు వచ్చింది. ఇపుడీ ప్రాంతంలో ఒక నది ఉంది. దాని పేరు "గగ్గర్”. ఇది కేవలం వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది.
32 చిన్నా, పెద్ద నదులు సరస్వతీనదిగా పిలువబడుతూ, సరస్వతీనదికి చెరగనిముద్రను వేస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి శ్రీకృష్ణుడు నిర్యాణమొందిన 'ప్రభాస' పట్టణంలో కలదు. లవణానదిలో కలుస్తున్న మరొక సరస్వతీనది ఉంది. అది పుష్కరసరోవరంలో పుట్టి లవణానదిలో కలిసి పుష్కర సరస్వతి అనే పేరు పొందింది. ఈ లవణానదియే ఇప్పుడు కచ్ సింధుశాఖలో కలియు “లూనీనది”.
వైదికకార్యవిజ్ఞానానికి, ఆర్షసంప్రదాయానికి పురుడు పోసిన ఈ సరస్వతీనదిని గుర్తించాలని, దీని పునరుజ్జీవనానికై ప్రయత్నిస్తూ 1819 సంవత్సరం నుంచి పరిశోధనలు చేయబడుతున్నాయి. 1985 సం॥లో వైదిక సరస్వతీనదీపరిశోధనా ఉద్యమం ప్రారంభమై 18 మంది సభ్యులతో ఒక సమితి నిరంతరం శ్రమిస్తూ సరస్వతీనదిని పునరుజ్జీవింపచేసి కృత కృత్యమైంది. పుష్కరాలు వచ్చే నదులలో ఇది మూడవది. గురుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తే ఈ నదికి పుష్కరాలు వస్తాయి.
2025: మే 15 నుండి 26 వరకు
Comments
Post a Comment