Hanuman Jayanti: హనుమాన్ జయంతి
స్వామి భక్తికి ప్రతీక హనుమ. ఎక్కడెక్కడ శ్రీరామ నామజపం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడంట! ఏడాదిలో రెండుసార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. అయితే చైత్ర మాసంలో శ్రీరామనవమి తరువాత జరుపుకునేది హనుమత్ విజయోత్సవం అని అసలైన హనుమజ్జయంతి వైశాఖ మాసంలోనే అని పురాణాలూ చెబుతున్నాయి.
మహా పర్వదినం హనుమజ్జయంతి
శ్రీరామ భక్తులకు హనుమజ్జయంతి మహా పర్వదినంగా పండితులు చెబుతారు. ఏడాదికి రెండుసార్లు జరుపుకునే హనుమజ్జయంతి పర్వదినాన్ని ఈ ఏడాది చైత్రమాసంలో హనుమద్ విజయోత్సవం పేరిట ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వైశాఖ మాసంలో కూడా జరుపుకోనున్న హనుమజ్జయంతి మరింత ప్రత్యేకమని పండితులు చెబుతున్నారు.
హనుమజ్జయంతి ఏడాదిలో రెండు సార్లు ఎందుకు?
రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు. ఆరోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోక వనాన్ని ధ్వంసం చేసి, రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణాసురుని సైన్యం హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్లో వస్తుంది.
అసలైన హనుమజ్జయంతి ఇదే!
నిజానికి హనుమజ్జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజే అసలైన హనుమజ్జయంతి. హనుమంతుడు పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అది మే చివరి వారంలో హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి. ఈ రోజే అసలైన హనుమంతుని జయంతి.
హనుమజ్జయంతి రోజు హనుమను ఎలా పూజించాలి?
హనుమజ్జయంతి రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శుచియై పూజామందిరంలో హనుమంతుని చిత్రపటం ముందు ఈ రోజంతా ఉపవాసం ఉంటానని దీక్ష స్వీకరించాలి. హనుమాన్ కు ఇష్టమైన సింధూరం రంగు వస్త్రాలు ధరించాలి. హనుఅంటూని చిత్రపటాన్ని సింధూరంతో అలంకరించాలి. నువ్వులనూనె తో దీపారాధన చేయాలి. హనుమకు తమలపాకుల దండను సమర్పించాలి. పసుపురంగు అక్షింతలతో హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి.
ఎలాంటి నైవేద్యాలు హనుమకు ప్రీతికరం?
హనుమంతునికి అరటిపండ్లు ప్రీతికరం. అందుకే హనుమజ్జయంతి రోజు హనుమకు అరటి పండ్లను సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం హనుమకు నివేదించాలి. ఇంకా హనుమంతునికి ఎంతో ఇష్టమైన వడమాల, అప్పాల మాల సమర్పిస్తే కార్యసిద్ధి, జయం లభిస్తాయని శాస్త్ర వచనం. బెల్లం, శనగలు, బూందీ లడ్డు కూడా హనుమంతునికి ప్రీతికరమైన ప్రసాదాలు. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో హనుమజ్జయంతి సందర్భంగా 5 రోజులపాటు ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.
తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో ఈ వేడుకలు ఐదురోజుల పాటు కొనసాగుతాయి.
జాపాలి తీర్థంలో విశేష పూజలు
అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జాపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయిదు రోజుల పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఆకాశ గంగలోని శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో మొదటి రోజున మల్లెపూలు, రెండవ రోజున తమలపాకులు, మూడవ రోజున ఎర్ర గన్నేరు, కనకాంబరం, నాలుగవ రోజున చామంతి పూలతో అంజనాదేవి, బాలాంజనేయ స్వామి వారిని అభిషేకిస్తారు. చివరి రోజైన ఐదవరోజు సింధూరంతో అభిషేకం జరుగుతుంది. కన్నుల పండుగలా సాగే ఈ ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా ఉంటాయి.
సామూహిక పారాయణాలు
ఈ ఐదు రోజుల పాటు జాపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి. ఈ హనుమజ్జయంతి రోజున మనం కూడా హనుమను ఆరాధిద్దాం. సకలవిజయాలను, కార్యసిద్ధిని పొందుదాం.
2025 తేదీ: మే 22
జై హనుమాన్ !! హనుమద్ జయంతి శుభాకాంక్షలు !!
ReplyDelete