SRIKAKULESWAR SWAMY TEMPLE: శ్రీకాకుళేశ్వరస్వామి వారి ఆలయం
శ్రీకాకుళేశ్వరస్వామి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువై ఉన్నాడు.
ఇటు చరిత్రాత్మకంగాను, అటు పౌరాణికంగాను ప్రాశస్త్యం వహించిన ఈ క్షేత్రంలో శ్రీకాకుళేశ్వరస్వామి కలియుగంలో ప్రజల పాపభారాన్ని తగ్గించడానికి స్వయంభువుగా అవతరించాడని భక్తుల విశ్వాసం.
108 దివ్య క్షేత్రాలలో ఒకటిగా
దేశవ్యాప్తంగా వెలసిన శ్రీవైష్ణవ దివక్షేత్రాలలో శ్రీకాకుళేశ్వరం 57 వ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తూ బ్రహ్మ దేవుని ప్రయత్నం మేరకే ఉద్భవించిందని ఆలయ స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది.
ఆలయ స్థల పురాణం
కలియుగంలో రోజురోజుకి పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా ఆందోళన చెంది వారంతా చతుర్ముఖ బ్రహ్మతో కలిసి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమన్నాడంట! అప్పుడు దేవతలంతా తాము తపస్సు చేసిన ఈ ప్రాంతంలోనే వెలసి భక్తుల పాపాలను హరించామని కోరుకున్నారంట! దేవతల అభీష్టం మేరకు ఆ ప్రాంతంలో వెలయడానికి నారాయణుడు సమ్మతించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ తానే స్వయంగా నారాయణుని అక్కడ ప్రతిష్టించాడంట!
శ్రీకాకుళేశ్వరుడనే పేరు ఇందుకే!
బ్రహ్మకు ఆకులమైనందున 'కాకుళమని' పేరు వచ్చినదని, శ్రీహరి ఆ చోట ప్రతిష్ఠితుడైనందున కాకుళేశ్వరుడని, కాలక్రమేణా శ్రీకాకుళేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడని పురాణ కథనం.
వేదాల సారమైన ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మకు సంస్కృతం, విష్ణువుకు ఆంధ్రం, మహేశ్వరునికి ప్రాకృత భాషలంటే మక్కువ ఎక్కువట! అందుకే శ్రీ మహా విష్ణువు ఆంధ్ర భాషపై మక్కువతో శ్రీకాకుళంలో వెలిశాడని పురాణ కథనం.
అదృశ్యమైన స్వామి
క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలోనే ఈ ఆలయం ఉండేదని అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. నాలుగవ శతాబ్దం తరువాత ఒకరోజు ఉన్నట్లుండి స్వామి విగ్రహం మాయమైపోయింది. దాదాపు వెయ్యేళ్లపాటు స్వామి కనబడకుండా అదృశ్యమైపోయాడంట!
పునఃప్రతిష్ఠ
తరువాత కొన్నాళ్లకు ఒరిస్సా పాలకుడైన అంగపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ కాంచీపురానికి పోతూ మార్గమధ్యంలో కృష్ణా తీరంలో ఉన్న శ్రీకాకుళానికి వచ్చి ఈ క్షేత్ర మహిమను తెలుసుకొని, అదృశ్యమైన విగ్రహం ఎక్కడుందో కనిపెట్టి పునః ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకున్నాడంట! స్వామి విగ్రహం కోసం ఎన్నో ప్రాంతాలు వెతికినా దొరకలేదు. తీవ్ర నిరాశతో ఉన్న నరసింహవర్మకు స్వామి ఒకరోజు కలలో కనిపించి తాను వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో ఉన్నానని చెప్పాడంట! అప్పుడు నరసింహవర్మ అక్కడ తవ్వకాలు జరిపించగా స్వామి విగ్రహం బయట పడింది. ఆ విగ్రహాన్ని శ్రీకాకుళానికి తెచ్చి పునఃప్రతిష్ఠ జరిపించినట్లుగా ఆలయ శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఆముక్తమాల్యద రచనకు శ్రీకారం ఇక్కడే!
విజయనగర సామ్రాజ్య స్థాపకుడు శ్రీ కృష్ణదేవరాయలు శ్రీకాకుళ క్షేత్రానికి విచ్చేసి స్వామిని దర్శించి అక్కడే బస చేసారంట! ఆయనకు ఆ రాత్రి స్వామి కలలో కనిపించి ఆముక్తమాల్యద రచించమని ఆదేశించారట. అప్పుడు కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదకు ఇక్కడే శ్రీకారం చుట్టారంట! ఆలయ ఆవరణలో ఆగ్నేయ మూలలో ఉన్న 16 స్తంభాల మండపంలో శ్రీ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను రచించారు కాబట్టి ఆ మండపానికి ఆముక్తమాల్యద మండపమని పేరు స్థిరపడిపోయింది. మండపం మధ్యలో ఉన్న రాయలవారి విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది.
ఆలయ విశేషాలు
1205 వ సంవత్సరంలో స్వామి వారి పంచలోహ విగ్రహాన్ని చేయించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ వెలసిన అమ్మవారి పేరు శ్రీ రాజ్యలక్ష్మి. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల ఆధీనంలోకి వెళ్ళింది. అటు తర్వాత దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ ఆలయాన్ని పునరుద్దరించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
నారాయణతీర్థులు శ్రీకృష్ణలీలా తరంగిణిలో, శ్రీనాధుడు క్రీడాభిరామంలో ఈ క్షేత్ర మహిమను, ఆంధ్రమహావిష్ణువును కీర్తించారు.
శ్రీకాకుళేశ్వరుని దర్శనఫలం
శ్రీకాకుళేశ్వరుని ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణా నదిలో స్నానం చేసి స్వామిని దర్శిస్తే ఎలాంటి పాపాలైన పోతాయని విశ్వాసం. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వరుని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం.
పూజోత్సవాలు
ప్రతి ఏడాది వైశాఖ మాసంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
ఎలా చేరుకోవచ్చు
శ్రీకాకుళానికి చేరుకోవడానికి విజయవాడ నుంచి బస్సు సౌకర్యం కలదు.
కలియుగంలో పాప పరిహారం కోసం తప్పక దర్శించాల్సిన క్షేత్రం శ్రీకాకుళం.
Comments
Post a Comment