Magha Puranam Telugu: మాఘ పురాణం 27వ అధ్యాయం - పూర్వజన్మ పాపం వల్ల పుత్రశోకం- పులి చేతిలో చిన్న భార్య దుర్మరణం- సులక్షణ రాజు కథ

 

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షుల సంవాదం

గృత్స్నమదమహర్షి జహ్ను మహర్షితో "ఓ జహ్నువు! మాఘ మాస మహాత్యమును ఇంకా చెబుతున్నావు శ్రద్ధగా వినుము" అంటూ మాఘ పురాణం ఇరవై ఏడవ అధ్యాయాన్ని చెప్పడం ప్రారంభించాడు.

మాఘ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము

సులక్షణ రాజు కథ

ద్వాపరయుగంలో సూర్యవంశంలో జన్మించిన అంగదేశాధిపతి అయిన సులక్షణుడనే రాజు కలడు. ఇతను మిక్కిలి ధర్మాత్ముడు. ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు. ఈ రాజుకు నూరుమంది భార్యలు ఉన్నప్పటికినీ సంతానం లేకుండెను. సులక్షణుడు పుత్రసంతానం కోసం అనేక ధర్మకార్యములు చేసినప్పటికిని పుత్రులు కలగక పోవడంతో చింతాక్రాంతుడై తనలో తాను 'పూర్వజన్మలో నేను ఎలాంటి పుణ్యకార్యాలు చేసి ఉండలేదు కాబట్టి నాకు పుత్రులు కలగలేదు. ఈ లోకంలో దరిద్రునకు, సంతానం లేనివారికి, చేసిన మేలు మరచిన వాడికి, వేదము రాని విప్రునకు సద్గతులు ఉండవని అంటారు కదా! నేను ఎలాగైనా మునీశ్వరులు ఆశ్రమాలకు వెళ్లి వారికి సేవచేసి నా అభీష్టం తెలిపి సంతానం పొందే ఉపాయం తెలుసుకుంటాను" అనుకొని విచిత్రమైన రథమెక్కి పరివారంతో కలిసి నైమిశారణ్యానికి చేరుకున్నాడు.

మునీశ్వరులను సేవించిన సులక్షణుడు

సులక్షణుడు నైమిశారణ్యానికి చేరుకొని అక్కడి మునులకు నమస్కరించి వారికి సకల ఉపచారాలు చేసి తన పుత్రకాంక్షను తెలియజేసెను. మునీశ్వరులు రాజుకు సంతానం కలగకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని యోచించి వారి దివ్యదృష్టితో సులక్షణుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఈ విధంగా చెప్పసాగెను.

సులక్షణుని పూర్వజన్మ పాపం

మునీశ్వరులు రాజుతో ఓ రాజా! పూర్వజన్మ పాపం వల్ల నీకు సంతానం కలగలేదు. పూర్వజన్మలో నీవు క్షత్రియుడవు. సౌరాష్ట్ర దేశానికి రాజువు. నీవు రథ గజ తురగ పదాతులతో కూడిన సమస్త సంపదలతో తులతూగుతూ ఉండేవాడివి. కానీ నీవు మాఘ మాసంలో రథసప్తమి రోజు నదీ స్నానం చేయలేదు. అంతేకాదు రథసప్తమి రోజు గుమ్మడికాయను దానమివ్వలేదు. ఈ పాప ఫలితంగా నీకు ఈ జన్మలో సంతానం కలుగలేదు. మాఘ శుద్ధ సప్తమి రోజు గుమ్మడికాయను దానమిచ్చిన వారు పుత్రసంతానాన్ని పొందుతారు.

సులక్షణునికి సంతాన ఫలం ప్రసాదించిన మునులు

మునీశ్వరులు మాటలు విన్న సులక్షణుడు పుత్రార్థియై మునుల పాదాలకు నమస్కరించి, వారిని పరివిధాలుగా స్తోత్రం చేసి "మునివల్లభులారా! నాకు పుత్రుడు కలిగేలా వరం ప్రసాదించమని" కోరుతాడు. మునీశ్వరులు రాజుకు ఒక ఒక మాదీఫలముని మంత్రించి ఇచ్చి రాజుతో "ఓ రాజా! ఈ ఫలమును నూరు ముక్కలు చేసి నీ భార్యలచే తినిపించు. అప్పుడు నీ నూర్గురు భార్యలు సంతానవంతులు అవుతారు" అని ఆశీర్వదించుతారు.

సులక్షణుని చిన్నభార్య అసూయ

తన దేశానికి తిరిగి వచ్చిన సులక్షణునికు భార్యలు ఎదురేగి స్వాగతం పలుకుతారు. రాజు మంత్రించిన ఫలాన్ని తెచ్చాడని దానితో తమకు సంతానం కలుగుతుందని తెలిసి భార్యలు సంతోషిస్తారు. రాజు ఆ ఫలాన్ని తన శయన గృహంలో ఉంచి భోజనం కోసం ఇంకో గృహానికి వెళ్తాడు. సులక్షణుని నూర్గురు భార్యాలలో నూరవ భార్య తనకు మాత్రమే సంతానం కలగాలని అసూయతో ఆ పండును దొంగలించి రహస్య ప్రదేశంలో కూర్చుని ఆ పండు మొత్తం తినేసి ఏమి తెలియనట్లు అందరితో కలిసి రాజు వద్దకు వెళ్లింది. భోజనం చేసాక రాజు తన భార్యలకు ఇవ్వడానికి పండు కోసం వెతికితే ఆ పండు ఎక్కడా కనిపించదు. దాసీలను, భార్యలను అందరినీ విచారించినా పండు జాడ తెలియరాలేదు. రాజు విచారంతో మూర్చిల్లుతాడు. కొంతసేపటికి సులక్షణుడు మూర్ఛ నుంచి తేరుకున్నాక రాజు చిన్నభార్య తాను ఆ పండును తిన్నానని నిజం చెబుతుంది. జరిగిందేదో జరిగింది కనీసం ఒక్క కొడుకైనా పుడతాడు కదా అని రాజు సంతోషంతో చిన్న భార్యను అపురూపంగా చూసుకోసాగాడు.

పులి చేతిలో చిన్న భార్య దుర్మరణం

సులక్షణుని తక్కిన భార్యలు అసూయతో చిన్న భార్య గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి రకరకాల విష ప్రయోగాలు చేస్తారు. అయితే వీటి వల్ల గర్భానికి ఏమి కాదు కానీ చిన్న భార్యకు మతిభ్రమిస్తుంది. ఒకరోజు ఆమె మతి సరిగా లేని స్థితిలో అంతఃపురాన్ని వదిలి ఘోరమైన అరణ్యంలోకి ప్రవేశిస్తుంది. పదిమాసాలు నిండి ఆమె పండంటి మగబిడ్డను ప్రసవిస్తుంది. ఇంతలో ఆ అరణ్యంలో ఒక పెద్దపులి ఆహారం కోసం తిరుగుతూ రక్తం వాసనతో ఆ ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉన్న స్త్రీని చూసి ఆమెను చంపి తినేస్తుంది. రక్తమయమైన శిశువును ఆ అరణ్యములోని హంస తన పరివారంతో వచ్చి తన రెక్కలచే కాపాడుతూ, తేనే, పండిన పండ్లు తెచ్చి పెడుతూ ఒక సంవత్సరం పెంచి పోషిస్తాయి. కొంతకాలం తర్వాత ఆ హంసలు ఆ బాలుని ఒక సరోవర తీరానికి చేరుస్తాయి.

మునికాంతల సంరక్షణలో బాలుడు

ఒకనాడు మునికాంతలు సరోవరంలో తమ భర్తలతో కలిసి స్నానం చేస్తుండగా ఆ బాలుని చూస్తారు. ఆ మునులతో ఒక సుగుణుడనే మునికి ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానం లేదు. ఈ బాలుని తీసుకెళ్లి వాళ్లు అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. అయితే మునుల ఇద్దరు భార్యలు ఎవరికి వారే ఈ బాలుని నేనే పెంచాను, వీడు నా కొడుకే అంటూ నిత్యం కలహించుకోసాగారు. ఒకరోజు ముని పెద్ద భార్య అసూయతో ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లవాడిని ఎత్తుకొనిపోయి జనాలు సంచరించని ఘోరారణ్యంలో విడిచి ఏమీ తెలియనట్లు ఇంటికి తిరిగి వచ్చింది. పిల్లవాడు కనబడక సుగుణుడు, చిన్న భార్య తక్కిన ముని జనమంతా చింతించసాగారు.

ఘోరారణ్యంలో బాలుని దుస్థితి

మూడు సంవత్సరాల బాలుడు నిర్జన అరణ్యంలో కాపాడేవారు లేక ఎలాగో ఓ తులసి చుట్టూ సమీపానికి చేరుకుంటాడు. తులసి వృక్షం దర్శనంతో, స్పర్శతో ఆ బాలునికి స్వస్థత చేకూరుతుంది. ఆకలికి, దాహానికి, ఎండకు తాళలేక ఆ బాలుడు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తుండగా ఆ అడవిలోని క్రూర జంతువులు, ఇతర పశుపక్ష్యాదులు కూడా బాలుని దుస్థితికి ఏడవసాగాయి. కానీ తల్లిలా పెంచిన ముని భార్యకు మాత్రం బాలుని పట్ల కనికరం లేకుండా పోయింది.

బాలుని శ్రీహరి భక్తి

అరణ్యములో జంతుజాలాలు ఆ బాలునికి పండ్లు, తేనే, మంచినీరు తెచ్చి ఆకలిదప్పులు తీర్చి పెంచి పోషించాయి. తులసి సాంగత్యం వలన ఆ బాలునికి శ్రీ హరినామ సంకీర్తన పట్ల ఆసక్తి కలిగింది. ఆ బాలుడు ఆ ఘోర అరణ్యమందు "కృష్ణా! వాసుదేవా! గోవిందా! అచ్యుతా! నరసింహా! అని భగవంతుని నామాలను కీర్తిస్తూ శ్రీహరిని భక్తివిశ్వాసాలతో పూజిస్తూ ఉండేవాడు.

ఇక్కడవరకు ఈ కథను చెప్పిన గృత్స్నమదమహర్షి జహ్నువు తో "జహ్ను మహర్షీ! విన్నావుగా! తులసి దర్శనం, తులసి స్పర్శ వలన పాపనాశనం కలిగి అరణ్యములలో కానీ గృహంలో కానీ భయాలు దరిచేరవు" అంటూ ఇరవై ఏడవ అధ్యాయాన్ని ముగించాడు.

ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! సప్తవింశాధ్యాయ సమాప్తః

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి