Nava Narasimha Temples: నవ నారసింహ క్షేత్రాలు

నృసింహావతారం దాల్చిన స్వామిని పూజించే గుడులు అంతటా ఉన్నప్పటికీ స్వామి స్వయంభూగా వెలిసిన తొమ్మిది ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యం చెందాయి. వీటినే నవ నారసింహ క్షేత్రాలు అని పిలుస్తారు. 

యాదగిరిగుట్ట: నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి తెలంగాణలో ప్రముఖ దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట. పూర్వం రుష్యశృంగుని కొడుకు యాద రుషి ఈ కొండమీద నరసింహుణ్ణి చూడాలని తపస్సు చేయగా, ఉగ్ర నరసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ ఉగ్రరూపం చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని యాద రుషి కోరగా అప్పుడు స్వామి కరుణించి, లక్ష్మీసమేతుడై కొండపై కొలువుదీరాడట. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలూ నయమైపోతాయనేది భక్తుల విశ్వాసం.

ధర్మపురి: ఇది కరీంనగర్‌ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరంలో ఉంది. రాక్షసవధ అనంతరం స్వామి ఇక్కడే తపస్సు చేశాడనీ, ఆపై స్వయంభూగా వెలిసి యోగానందుడిగా భక్తుల కోరికలు తీరుస్తున్నాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే రాజు పాలించినందుకే ధర్మపురి అని పేరు వచ్చిందనీ, ఆయన తపస్సు చేయడంవల్లే స్వామి ఇక్కడ వెలిశాడనేది ఇంకో కథనం.

అహోబిలం: ఈ ఆలయం నవ నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది. కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంటుంది అహోబిలం. నారాయణుడు ఉగ్రనారసింహుడై హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన ప్రాంతం ఇదేనట. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో "అహోబలం"అని పొగిడారట. అదే అహోబిలంగా వాడుకలోకి వచ్చిందట. శ్రీమహావిష్ణువు ఉగ్రనారసింహావతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు.

సింహాద్రి: తూర్పుకనుమల్లో సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తులోని కొండమీద విశాఖ పట్టణానికి సమీపంలో వెలిసిన దివ్య క్షేత్రమే సింహాచలం. ఇక్కడ స్వామివారు వరాహముఖం, మానవా కారం, సింహపుతోకతో భక్తులకు దర్శనమిస్తాడు. వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంతో వెలసిన ఈ స్వామిని "సింహాద్రి అప్పన్న" అని కూడా పిలుస్తారు. మిగిలిన టెంపుల్స్​కి భిన్నంగా పశ్చిమముఖంగా ఉండే ఈ క్షేత్రాన్ని లాంగూల గజపతి క్రీ.శ. 11వ శతాబ్దంలో నిర్మించాడట.

అంతర్వేది: హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుని సంహారానంతరం వశిష్ఠుడి కోరిక మేరకు విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో లక్ష్మీనృసింహ స్వామిగా వెలిశాడనేది పౌరాణిక గాథ. వశిష్ఠమహర్షి ఈ ప్రాంతంలో యాగం చేసినందువల్లే దీనికి 'అంతర్వేది' అనే పేరు వచ్చిందట. మాఘమాసంలో స్వామివారి కల్యాణోత్సవాలు ఈ క్షేత్రంలో కన్నులపండుగగా జరుగుతాయి.

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలో నవ నారసింహక్షేత్రాల్లో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం ఉంది. నిజానికి ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి. కొండ కింద ఉన్న దైవాన్ని లక్ష్మీనరసింహస్వామి గానూ, కొండమీద ఉన్న స్వామిని పానకాల స్వామిగానూ పేర్కొంటారు. కొండ మీద తెరుచుకున్న నోరు ఆకారంలోనే స్వామి దర్శనం ఇస్తాడు. అక్కడి స్వామికి పానకం అంటే చాలా ఇష్టం. ఎంత పాత్రతో స్వామివారికి పానకం అభిషేకించినా సగం తాగి సగం వదలడం ఈ ఆలయం విశిష్టత.

వేదాద్రి : నవ నారసింహ క్షేత్రాల్లో మరొకటి కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీనరసింహ, వీర నరసింహస్వామి అవతారాల్లో నరసింహస్వామిని దర్శించుకోవచ్చు.

మాల్యాద్రి : ప్రకాశం జిల్లా కందుకూరు-పామూరు రోడ్డులోని వలేటివారి పాలెం దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడి కొండ పూలమాల ఆకారంలో ఉండటంతో ఈ ప్రదేశానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు. అగస్త్య మహాముని మాల్యాద్రిమీద తపమాచరించగా లక్ష్మీనారసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.

పెంచలకోన : ఈ దేవాలయం నెల్లూరు జిల్లా రాపూర్‌ మండల కేంద్రంలో ఉంది. ఇక్కడ స్వామి చెంచులక్మీ సమేతుడై వెలిశాడు. కృతయుగాన హిరణ్య కశిపుని సంహారానంతరం శేషాచల కొండల్లో ఉగ్ర రూపంలో గర్జిస్తూ సంచరిస్తున్న టైమ్​లో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తారసపడిందట. స్వామి భీకరరూపం చూసి చెలికత్తెలంతా పారిపోయినప్పటికీ ఆమె మాత్రం నిలబడి ఉండటంతో ఆమె ధైర్యసాహసాలు, సౌందర్యానికీ ముగ్దుడైన స్వామి శాంతించాడట. తర్వాత తనను వివాహమాడాడనీ, ఆమెను పెనవేసుకుని ఇక్కడే శిలారూపంలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడి స్వామిని "పెనుశిల లక్ష్మీనృసింహస్వామిగా" భక్తులు కొలుస్తారు.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి