Dattatreya Jayanti: దత్త జయంతి
- మార్గశిర శుద్ధ చతుర్దశి దత్తజయంతిగా చెప్పబడింది.
- అత్రిమహర్షి, అనసూయలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో దత్తాత్రేయుడు ఈ చతుర్దశినాడే జన్మించాడు.
- ఆధ్యాత్మిక సాధనకు మూలమైన యోగవిద్యకు ఈ దత్తాత్రేయుడే పరమగురువు.
- ఈ రోజున దత్తాత్రేయుల వారిని విశేషంగా పూజించాలి.
- ఈ స్వామిని పూజించడంవల్ల జ్ఞానం లభించడమే కాకుండా, ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి.
- అంతేకాకుండా కష్టాలన్నీ తొలగిపోయి ఎంతటి జటిల సమస్యలైనా పరిస్కారాలు లభిస్తాయి.
- ఇంకా భూత,ప్రేత, పిశాచాల పీడ కూడా తొలగిపోతుంది.
- ఈ రోజున దత్తాత్రేయుని పూజించడంతో పాటు, గురుగీత పారాయణం చేయడం కూడా ఎంతో మంచిది.
- ఈ దత్తజయంతిని కొన్ని ప్రాంతాలలో మార్గశిర పౌర్ణమి రోజున ఆచరించే సంప్రదాయం కూడా ఉంది.
వ్యాస మహర్షి రచించిన నారద పురాణం, భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తోంది. మూడు తలలు, ఆరు చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట నాలుగు శునకాలు, గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించేనట్టేనని విశ్వాసం. దత్తాత్రేయుని బ్రహ్మచారి, సన్యాసిగా కూడా పూజిస్తారు.
దత్తాత్రేయ స్వామి ప్రదోష కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున దత్తుని సాయంత్రం వేళలో పూజించడం సంప్రదాయం. దత్తజయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచియై పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో. అలంకరించాలి పూజా మందిరములో రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఈ రోజు పూజ చేసుకునే వారు పసుపు రంగు వస్త్రాలను ధరించడం శుభకరం.
దత్తాత్రేయుడు నిల్చున్న భంగిమలో ఉన్న చిత్ర పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ గంధం, పసుపు రంగు పుష్పాలు అలంకరించాలి. ఆవు నేతితో దీపారాధన చేసుకొని ముందుగా గణపతిని పూజించి దత్తుని పూజ మొదలు పెట్టాలి. దత్త అష్టోత్తరం, దత్తస్తవం, దత్తాత్రేయ సహస్రనామావళి భక్తిశ్రద్ధలతో పఠించాలి. పసుపు రంగు ప్రసాదాలు అంటే నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, కేసరి బాత్ వంటి ప్రసాదాలను నివేదించాలి. ఈ రోజు గురు చరిత్ర, శ్రీ సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణం చేయడం శుభప్రదం.
ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. స్వామికి కొబ్బరికాయ సమర్పించాలి. ఈ రోజు దేవాలయాలలో అన్నదానం చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి వెంట ఎల్లప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఈ నాలుగు నాలుగు వేదాలకు చిహ్నమని విశ్వాసం. అందుకే దత్త జయంతి రోజున కుక్కలకు ఆహారం సమర్పిస్తే శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఈ రోజు గోమాతకు గ్రాసం తినిపించడం కూడా మంచిది. విశేషించి ఈ రోజు దత్తాత్రేయ జననానికి సంబంధించిన పురాణ గాథను చదివినా, విన్నా శుభం జరుగుతుంది.
భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు, జాగారాలు అవసరం లేదు. మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామి మానవాళికి ఇచ్చే సందేశం. అందుకే దత్తాత్రేయుని గురువుగా భావించి పూజించి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.
2024తేదీ: డిసెంబర్
Comments
Post a Comment