Utpanna Ekadasi: ఉత్పన్న ఏకాదశి
- కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి లేదా ఉత్పన్న ఏకాదశి అంటారు.
- ఈ మాసంలో వచ్చే ఏకాదశి తిథులూ పరమ పవిత్రమైనవి.
- ఏకాదశి అనే దేవత ఈ మాసంలోనే జన్మించిందని చెబుతారు.
- ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలనుకునేవారు ప్రారంభమైనప్పటినుండి ఏకాదశి ఘడియలు ముగిసేవరకూ ఎలాంటి ఉడికించిన ఆహారం తీసుకోకుండా ఉండాలి.
- మరి కొందరైతే కేవలం నీరు మాత్రమే తీసుకుంటారు.
- ఉపవాసం వల్ల ఆరోగ్యంతోపాటు, భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది
ఏకాదశి దేవత జన్మించడానికి ఓ పురాణ కథనం ఉంది. పూర్వం మహా గర్విష్టి, మహా బలవంతుడైన మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఇంద్రాది దేవతలను ఓడించాడు. త్రిమూర్తులనుకూడా లెక్క చేయకుండా దేవతలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టెవాడు. ఆ రాక్షసుని బారినుండి తమను కాపాడమంటూ దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు. విష్ణుమూర్తి మురాసురునితో తలపడ్డాడు. ఇరువురి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. వందల సంవత్సరాలు యుద్ధం కొనసాగుతోంది. ఓరోజు విష్ణుమూర్తి యుద్ధంలో కలిగిన అలసట తీర్చుకునేందుకు. ఓ గుహలో విశ్రాంతి తీసుకున్నాడు.
ఈ విషయం మురాసురునికి తెలిసి విష్ణుమూర్తిని నిద్రలో సంహరించాలనుకున్నాడు, నిదానంగా అక్కడికి వెళ్లాడు. యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిలోంచి వెంటనే ఒక శక్తి ఉద్భవించింది. ఆమే ఏకాదశి. తన కంటి చూపుతోనే ఆ మురాసురుని అంతం చేసింది. ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. వరం కోరుకోమన్నాడు. తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉంటారో వారికి పుణ్యం ప్రాప్తించాలని కోరుకుంది. విష్ణుమూర్తి వరమివ్వడంతో ఏకాదశికి అంతటి విశిష్టత వచ్చింది. మురాసురుని సంహారం అనంతరం విష్ణుమూర్తికి మురారి అన్న పేరు వచ్చింది.
2024 తేదీ: నవంబర్ 26.
Comments
Post a Comment