Karthika Puranam: కార్తీక పురాణం 18వ అధ్యాయము -మాసత్రయే ప్రాతఃస్నానమహిమా, చాతుర్మాస్యవ్రతము, హరినారద సంవాదము

 

ఉద్భూతపురుషుడిట్లనెను. మునీశ్వరా ! నేననుగ్రహించబడితిని. నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్యా! నాకు నీవే తండ్రివి. నీవే సోదరుడవు. నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను, దరిద్రుడనై మొద్దుగానున్న నాకిప్పుడు నీవు గాక గతి ఎవ్వ రయిరి. పాపవంతుడనైన నేనెక్కడ ఇట్టి సద్గతియెక్కడ? పాపములకు స్థానమైన నేనెక్కడ. పుణ్యమైనకార్తికమాసమెక్కడ? ఈ మునీశ్వరులెక్కడ, ఈ విష్ణుసన్నిధి ఎక్కడ. ప్రారబ్ద సుకృతమున్నయెడల తప్పక ఇట్లు ఫలించును గదా? నాకెద్దియో పూర్వపుణ్యమున్నది. దానిచే ఇట్లింతయు లభించెను.

అయ్యా! నాయందు దయయుంచి బాగా తెలియజెప్పుము. మను ష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆ కర్మలకు ఫలమెట్లు గలుగును? వాటి ఉపదేశమెట్లు, చేయుటకు ముఖ్యకాలమెద్ది? కర్మలెవ్వి? ఏమి కోరిచేయ వలెను? ఈ విషయమంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీవాక్కను వజ్రాయుధముచేత నా పాపపర్వతములు కూలినవి. అంగీరసుడు పల్కెను. ఓయీ ! నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెద వినుము?

అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియకాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఃఖాది ద్వంద్వములులేవు. అవి దేహాదిధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మనుజేయ వలెను. దానితో చిత్తశుద్ధిగలిగి తద్వారా జ్ఞానమునుబొంది దానిచేత ఆత్మను యథార్ధ ముగా తెలిసికొనవలెను.

దేహధారియయినవాడు తనకు విధించబిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్తకర్మచేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలిసికొని తరువాత చేయవలెను.

స్నానముచేయక చేయుకర్మ ఏనుగు భక్షించిన వెలగపండువలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమైయున్నది. నిరంత రము ప్రాతఃస్నానమాచరించ లేనివాడు తులా సంక్రాంతి యందు కార్తికమాసమందును, మకరమాసమందును. (మేష) వైవాఖమందును స్నానము చేయవలెను.

ఈ మూడు మాసములందును ప్రాతఃకాలమందు స్నానముచేయు వాడు వైకుంఠమునకు బోవును మరియు వానికి ఉత్తమగతి కలుగును. చాతుర్మాస్యాది పుణ్యకాల ములందును, చంద్రసూర్యగ్రహణము లందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణము లందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము.

బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది. 1. స్నానము 2. సంధ్యాజపము 3. హోమము

4. సూర్యనమస్కారము తప్పక చేయదగినవి. 

స్నానమాచరించనివాడు రౌరవనరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టు దుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తిక మాసము. ఈ కార్తికము ధర్మార్థకామ మోక్షములనిచ్చును. ఈ కార్తికముతో సమానమైన మాసము లేదు. ఇంతకంటే పుణ్యకాలములేదు.

వేదముతో సమానమైన శాస్త్రములేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. బ్రాహ్మణ్యముతో సమానమైన కులములేదు. భార్యతో సమానమైన సుఖములేదు. ధర్మముతో సమానమైన మిత్రుడులేడు. నేత్రముతో సమానమైన జ్యోతిస్సులేదు. కేశవునితో సమానమైన దేవుడులేడు. కార్తికమాసముతో సమానమయిన మాసములేదు.

కర్మస్వరూపమును దెలిసికొని కార్తికమాసమందు ధర్మములను జేయువాడు కోటి యజ్ఞఫలమును బొంది వైకుంఠమందుండును. ఉద్భూత పురుషుడడిగెను. అయ్యా! చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవనిచేత చేయబడినది? ఆ వ్రతవిధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏలోకమునకు పోవును? ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము.

అంగీరసుడిట్లు పల్కెను ఓయీ! నీవు ఈ మనుష్యులకు బంధువవు నీ ప్రశ్న లన్నియు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును జెప్పె దను సావధానుడవై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో గూడా ఆషాడ శుక్ల దశమిదినంబున పాలసముద్రమందు నిద్రయనువంకతో శయనించును. తిరిగి కార్తిక శుక్ల ద్వాదశిరోజున లేచును. ఇది చాతుర్మాస్యము. అనగా నాలుగు మాసములు చేయువ్రతము.

ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి. అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాస ములు విశ్రానికై నిద్రించును. విష్ణువునకు నిద్రసుఖమిచ్చునది గనుక యిది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును బొందును. ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగును.

దీనికి కారణమును జెప్పెదను వినుము. ఈ విషయమందు నారదు నకు హరి చెప్పిన కారణమును జెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరిచెప్పినదొక కథ యున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠలోకంబున హరి లక్ష్మితో గూడ సింహాసనమందు కూర్చుండి సుర కిన్నరభేచరోరగగణములచేతను, స్వగణభృత్యులచేతను సేవింపబడు చుండెను. (ఖేచర= ఆకాశసంచారులు, ఉరగ=సర్పములు)

హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠ లోకమును గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు గలిగి పద్మపురేకుల వంటి నేత్రములతో ప్రకాశించెడి విష్ణుమూర్తిని జూచెను. చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తియొక్క పాదములకు మ్రొక్కెను. హరియు నారదునిజూచి నవ్వుచు తెలియని వానివలె ఇట్లనియెను.

ఓ నారదా ! నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా? ఋషుల ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మము లందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో జెప్పుము. నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితో నిట్లనియె.

ఓ స్వామీ! నేను భూమినంతయు తిరిగిచూచితిని. వేదత్రయమందు జెప్పబడిన కర్మమార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచి యుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు దెలియకున్నది.

కొందరు తినగూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగానున్నారు. కొందరు అహం కారవర్ణితులుగా నున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు. కొందరు నిందజేయువారుగా నున్నారు. కాబట్టి ఓదేవా ! ఏదయినా ఒక ఉపాయముచేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము.

నారదునిమాట విని భక్తవత్సలుడు, సమస్త లోకపాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకువచ్చెను. విష్ణుమూర్తి వృద్ధబ్రాహ్మణ రూపధారియై వేలసంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకువచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయానాటక ధారియై పుణ్యక్షేత్రములందును, తీర్థములందును, పర్వతములందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమియందును తిరుగు చుండెను.

ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని జూచి కొందరు భక్తితో అతిధి సత్కారము లను జేసిరి. కొందరు నవ్విరి. కొందరు నమస్కారముచేయరైరి. కొందరు అభిమానవంతు లైరి. కొందరుగర్వముతో ఉండిరి. కొందరు కామాంధులైయుండిరి. కొందరాయా క్రియాకలాపములను మానిరి. కొందరు ఏకవ్రపరాయణులైయుండిరి. కొందరు నిషిద్ధ దినములందు అన్నమును దినువారుగా నుండిరి. కొందరు ఏకాదశ్యుపవాసమాచరించని వారుగా నుండిరి. కొందరు తినగూడని వస్తువులను దినుచుండిరి. కొందటాచార వంతులుగా నుండిరి. కొందరాత్మచింతజేయుచుండిరి.

బ్రాహ్మణరూపధారియైన భగవంతుడు అట్టివారిని జూచి మంచి మార్గమునకు దెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిశార్యమందున్న మునిబృందముల సన్నిధికి వచ్చెను, వచ్చి బ్రాహ్మణరూపమును వదలి పూర్వమువలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖచక్రములను ధరించి లక్ష్మితోను, స్వభక్తులతోను గూడి ప్రకాశించుచుండెను. అచ్చటనుండు జ్ఞానసిద్ధులు మొదలయిన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమము నకు వచ్చినట్టివాడును అవిసెపువ్వుతో సమానమైన కాంతిగలవాడును, మెరుపువంటి వస్త్రముగలవాడును, కోటిసూర్యప్రభాభాసమానుడును, అనేక సూర్య కాంతివంతుడును, మనోవాచామగోచరుడును, దేవతాపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని జూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి.

వచ్చి హరి పాదములకు నమస్కారముచేసి వారి ముందర నిలిచి అంజలి బద్ధులై హరిని వక్ష్యమాణరీతిగా స్తుతించిరి.

Comments

Popular posts from this blog

Magha Puranam Telugu: మాఘ పురాణం 4వ అధ్యాయం- ఓ శునకం విష్ణుమూర్తిని పూజించి చక్రవర్తిగా మారిన కథ

Yadagirigutta Brahmotsavam 2025: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 - యాదగిరిగుట్ట

Jubilee hills Venkateswara Temple: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2025 తేదీలు - జూబ్లీహిల్స్

Sri Raghavendra Swamy Jayanti: శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి 2025

Magha Puranam Telugu: మాఘ పురాణం 24వ అధ్యాయం - సహవాస దోషంతో అష్టకష్టాలు పడిన విప్రుని కథ

Bhojana Niyamalu: నిత్యం తినే ఆహారంలో దోషాలు

Ganagapur Datta Swamy Temple: శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయం - గాణగాపురం

Bhadrapada Masam: భాద్రపద మాసం 2024

Pournami Garuda Seva: తిరుమల పౌర్ణమి గరుడ సేవ 2024 తేదీలు

Govatsa Dwadasi: గోవత్స ద్వాదశి