Karthika Puranam: కార్తీక పురాణం 17వ అధ్యాయము - అంగీరసోక్తతత్త్వబోధ, పార్వత్యా శ్రీ శంకరోక్తజ్ఞానబోధ
అంగీరసుడిట్లనెను. ఓయీ! కర్మబంధముక్తులు, కార్య కారణములు, స్థూల, సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన యీ విషయము పూర్వమందు కైలాసపర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దానిని ఇప్పుడు నీకు నేను జెప్పెదను. ఇతర చింతనుమాని వినుము.
నీవడిగిన ప్రశ్నకు సమాధానమును జెప్పెదను వినుము. జీవుడనగా వేరెవ్వడును లేడు. నీవే జీవుడవు. నేను యెవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను. ఇందుకు సందేహములేదు. దేహమేననెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము.
ఉద్భూతపురుషుడిట్లడిగెను. మునీశ్వరా ! మీరు చెప్పినరీతిగా వాక్యార్ధ జ్ఞానము నాకు గలుగలేదు. కనుక అహంబ్రహ్మేతి (నేను బ్రహ్మనను) వాక్యార్థమును ఎట్లు తెలిసికొనగలను. ఈ వాక్యార్థబోధకు హేతు వయిన పదార్థజ్ఞానము నాకు తెలయలేదు. కాబట్టి విమర్శగా చెప్పగోరెదను. ఆత్మ అంతఃకరణమునకు, తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్యరూపియు, ఆనందరూపియు, సత్యస్వరూపమునై వున్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకొనుటలేదు.
సచ్చిదానందస్వరూపుడును, బుద్ధికి సాక్షియునయిన వస్తువునే ఆత్మగా తెలిసి కొనుము. ఈ దేహమే ననెడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము.
దేహము ఘటమువలె రూపముగల్గిన పిండము గనుక ఇది ఆత్మ గాదు. ఇదిగాక ఈ దేహము ఘటమువలె ఆకాశాది పంచమహాభూతముల వలన బుట్టినది. గనుక దేహము వికారముకలది ఆత్మగాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలసికొనుము. అట్లే మనస్సులు బుద్ధిప్రాణములు, ఆత్మ వస్తువులుకావు.
దేహేంద్రియాదులన్నియు ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయు చున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని = ఆత్మయని తెలిసి కొనుమనిభావము. లోపలికి మలచుకొనబడిన ఇంద్రియా లతో తెలియదగిన దానికి ప్రత్యక్ అనిపేరు. ఇనుమును అయస్కాంత మణివలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను = ఆ బ్రహ్మనని తెలిసికొనుము.
ఎవనియొక్క సాన్నిధ్యమామ్రుచేత జడములైన=కదలికలేని దేహేంద్రి యమనః ప్రాణములు జన్మలేని ఆత్మవలె కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అతి తెలిసికొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షియై స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటియొక్క ఆద్యంతములను నేను సాక్షి అని తెలసికొనుచున్నాడో అది బ్రహ్మ అని తెలిసికొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటముకంటే భిన్నమో అట్లుగానే దేహాదు లను బ్రకాశింపజేయు బోధరూపుడైన నేను ఆత్మఅని తెలిసికొనుము. స
ఎవ్వడు సర్వప్రియుడై నీయొక్క పుత్రమిత్ర ప్రియాప్రియాది భావము లను ద్రష్టగా జూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలసికొనుము.
నిత్యము యెన్నిమారులు చూచినను పరమప్రేమకు=నిత్యానందము నకు స్థానమయినదే బ్రహ్మ అదేనేనని తెలిసికొనుము. సాక్షియు బోధ రూపుడగు వాడే నీవని యెఱుగుము, సాక్షిత్వమును, జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు.
దేహేంద్రియ మనః ప్రాణాహంకారములకంటే వేరయినవాడును 1. పుట్టుట = జనిమత్వ 2. ఉండుట = అస్తిత్వం 3. వృద్ధిగతత్వ=పెరుగుట 4. పరిణామత్వ = పరిణామము చెందుట 5. కృశించుట 6. నశించుట ఈ యాఱు వికారములు లేనివాడు. వికారములు ఈ 6 భావాలు లేనిది
బ్రహ్మత్వం పదార్ధమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించుస్వభావముచేత సాక్షాద్విది ముఖముగాను తచ్ఛబ్దార్ధమును దెలిసికొనవలయును. శ్లో॥ అత ద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విముఖేన | వేదాంతానాం ప్రవృత్తిస్స్యాత్ ద్విరా చార్య సుభాషితమ్ ॥ తచ్చబ్దమునకు బ్రహ్మ అర్ధము. అతచ్ఛబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్ధము. వ్యావృత్తియనగా ఇదిగాదని ఇదిగాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదిది. బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము సాక్షాద్వి దిముఖమనగా సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్యజ్ఞానానంద స్వరూపుడని తెలిసికొనవలయునని భావము. ఆత్మ సంసారలక్షణ విశిష్టముగాద నియు, సత్యస్వరూపమనియు, దృష్టిగోచరము గాదనియు, తమస్సుకు వైదనియు, అనుపమానంద రూపమనియు, సత్యప్రజ్ఞాది లక్షణయుత మనియు, పరిపూర్ణమనియు చెప్పబడును. అతద్వ్యావృత్తి రూపముగాను, సాక్షాద్విధిముఖముగాను దెలిసికొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనని అర్ధము.
వేదములచేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు, సర్వేశ్వరుడనియుసంపూర్ణ శక్తివంతు డనియు చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలిసికొనుము. నేనను నదియు బ్రహ్మయనునదియు ఒకే అర్ధము కలిగినవి. వేదములందు ఎవ్వనికి "తదను ప్రవిశ్య" ఇత్యాది వాక్యములచేత జీవాత్మ రూపముచేత ప్రాణులందు ప్రవేశమున్ను, ఆ జీవులను గుఱించి నియంతృత్వమున్ను జెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలిసి కొనుము.
వేదములందు ఎవ్వనికి కర్మఫలప్రదత్వము, జీవకారణకర్తృత్వము జెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలిసికొనుము. ఈ ప్రకారముగా "తత్ త్వం" అనుపదములు రెండును నిశ్చయించబడినవి. తత్ అనగాబ్రహ్మము, త్వం అనగా జవుడు, అనగా నీవె బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థమును జెప్పెదను. వాక్యార్ధమనగా తత్త్వం పదములకు ఐక్యము=ఏకత్వము చెప్పబడును.
ప్రత్యగాత్మయే అద్వయానందరూప పరమాత్మ పరమాత్మయే ప్రత్య గాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవమున గలుగునో అప్పుడే త్వం పదమునకు అర్ధము తెలియును. బ్రహ్మగాదను భ్రాంతి నశించును. తాదాత్మ్యమనగా అదియే ఇదియని అర్థము అనగా ఐక్యము.
తత్వమసి అనగా తత్, త్వం, అసి, ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్ధములయిన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ విశిష్టు లయిన జీవేశ్వరులను వదలి
లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన యెడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్ధముకు బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి మూడు విధములు. అందులో యిచ్చట భాగలక్షణను గ్రహించవలెను అనగా కొంత పదము విడిచి కొంతపదము స్వీకరించుట భాగలక్షణ యనబడును. తత్త్వమసి యందు సర్వజ్ఞత్వకించిజ్ఞత్వములను వదలికేవల జ్ఞానాత్మత్వమాత్రమునే గ్రహించిన యెడల అభేదము సంభవించును. తత్ = అది, త్వం = నీవు, అసి అయితివి. అనగా నీవే బ్రహ్మవైతివని భావము. సోయందే వదత్త ఇత్యాదిస్థలమందును యిట్లే బోధచేయబడుచు, తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏతద్దేశవిశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసి వైచిన దేవదత్తుడొక్కడే భాసించును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్త్వాలు వదలి కేవలజ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాసించును.
నేను బ్రహ్మనను వాక్యార్ధబోధ స్థిరపడువరకు శమదమాది సాధన ములు చేయుచు శ్రవణమనననిదిధ్యాసలను ఆచరించవలెను.
ఎప్పుడు శ్రుతిచేతను, గురుకటాక్షముచేతను తాదాత్మ్యబోధ స్థిర పడునో అప్పుడు సంసారమూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధకర్మ అనుభవింపుచుండి ప్రారబ్ధక్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదమొంది నిరతిశయానందముతో ఉండును.
కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను జేయవలెను. ఆకర్మవిధినంతయు గురువువలన దెలిసికొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగతపాపుడై తరువాత ఆ పుణ్యముచేత మంచిజన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియై కర్మబంధమును తెంచుకుని మోక్షమొందుదువు ఇందుకు సందేహములేదు.
అంగీరసమునీశ్వరుడు డిట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లడిగెను.
Comments
Post a Comment