Kaleswaram Temple: శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం - కాళేశ్వరం
కరీంనగర్ జిల్లా మహదేవ్ పూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదులు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ ప్రదేశంలో స్వయంభువుగా వెలసిన స్వామి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి.
ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి సోయగాల మధ్య అలరారుతున్న అతి పురాతనమైన ఈ ఆలయం ఒకప్పుడు అరణ్యంలో ఉండటం వల్ల రవాణా సౌకర్యం ఉండేదికాదు. అయితే 1976-82 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు జరగడంతో రవాణా వసతి సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయం నాలుగు వైపుల నాలుగు నంది మూర్తులు దర్శనమిస్తాయి. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడ గర్భాలయంలో ఒకే పాన మట్టం మీద రెండు లింగాలు ఉండటమే కాక ముక్తీశ్వర స్వామికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. ఈ రంధ్రాలలో అభిషేక జలం ఎంత పోసినప్పటికీ ఒక్కచుక్క కూడా బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి, సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తుందని ఆలయ చరిత్ర చెబుతోంది. గర్భాలయంలో ఉన్న రెండు లింగాలలో ఒకటి కాళేశ్వర లింగం కాగా, రెండవది ముక్తీశ్వర లింగంగా చెబుతారు. కాళేశ్వర లింగాన్ని యమధర్మ రాజు ప్రతిష్టించాడు. మహాశివుడు యమధర్మరాజుకిచ్చిన వరం కారణంగా, ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా కాళేశ్వరలింగాన్ని దర్శించి అనంతరం ముక్తీశ్వర లింగాన్ని దర్శించాలన్న నియమం ఉంది.
ఇక్కడ పార్వతీమాత శుభానందదేవిగా కొలుపులందుకుంటోంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క మహాసరస్వతి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రౌఢసరస్వతిగా నీరా జనాలందుకుంటోంది.
ఆలయంలో మరో పక్క ప్రధాన ద్వారానికి ముందు భాగంలో సూర్య దేవాలయం ఉంది. ఇంకోపక్క విజయ గణపతి కొలువుదీరాడు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామి వారి ఆలయానికి ముందు భాగంలో కోనేరు ఒకటి ఉంది. ఈ కోనేరులో స్నానమాచరించిన వారికి కాశీలోని మణికర్ణికా ఘాట్లో స్నానమాడిన ఫలితం దక్కుతుందంటారు.
ప్రధానాలయ ఆవరణలో యమకోణం ఉంది. ఈ ప్రాంగణంలోనే యముడు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ యమకోణ ప్రవేశం చేసే వారికి యమ బాధలుండవని. ముక్తికలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్ల ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఆది ముక్తీశ్వర స్వామి ఆలయం ఉంది. ఆది ముక్తీశ్వర స్వామి దర్శనం సర్వపాపహరణం. కాశీలో మరణిస్తే - కైలాస ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. కాని ఈ క్షేత్రంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శిస్తేనే కైలాస ప్రాప్తి కలుగుతుందన్నది స్థలపురాణం.
ఈ ఆలయం ఏటా మహాశివరాత్రి ఉత్సవాలతో సహా పండుగలు, పర్వదినాలు, కార్తీక మాసాలలో భక్తులతో పోటెత్తుతుంది. ఆయా రోజుల్లో స్వామి వార్లకు మహాన్యాసక రుద్రాభిషేకాలు, అర్చనాది అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ వేళలు
ఉదయం 5.00 నుండి మధ్యాహ్నం 1.30
సాయంత్రం 4.00 నుండి రాత్రి 8.00 వరకు
వరంగల్లుకు 110 కి.మీ దూరంలోనూ ఉన్న ఈ దివ్యక్షేత్రానికి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది.
Comments
Post a Comment