Mangala Gowri Vratam: మంగళగౌరి వ్రతం
- శ్రావణంలో ప్రతీ మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు.
- ఈ వ్రతాన్ని పెళ్ళయినప్పటి నుండి అయిదు సంవత్సరాలు ఆచరించాలి.మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.
- ఈ వ్రతాన్ని నారదుడు సావిత్రీదేవికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించినట్లుగా చెప్పబడింది.
- ఈ వ్రతంలో పగలు విధివిధానంగా మంగళ గౌరీ దేవిని పూజించాలి.
- పూజలో ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ గౌరీదేవిని అర్చించడం తప్పనిసరి.
- మహా నివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి.
- వ్రతం నాటి సాయంకాలం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇవ్వాలి.
- ఈ వ్రతం తోర పూజ కూడా ప్రత్యేకంగా చెప్ప బడింది.
- తోరను తయారు చేసుకునేందుకు పసుపు పూరి దారాన్ని మూడు పొరలుగా తీసుకొని, దాన్ని తొమ్మిది ముళ్ళు వేయాలి.
- తరువాత ఆ దారానికి పూలను కాని, దవనాన్ని కాని, మాచిపత్రి కాని కట్టాలి ఈ విధంగా మూడు తోరలను తయారు చేసుకొని, గౌరీ పూజలో తోరలను కూడా పూజించాలి.
- పూజానంతరం ఒక తోరను గౌరీదేవికి సమర్పించి, తక్కిన రెండింటిలో ఒక దాన్ని వ్రతం ఆచరించిన వారు కుడిచేతికి కట్టుకొని, రెండవదాన్నిపెద్ద ముత్తైదువుకు వాయనంతోపాటు యివ్వాలి.
- ఈ వ్రతం వల్ల స్త్రీలకు అమంగళం కలుగకుండా వుండి, అయిదవతనం వృద్ధి చెందుతుంది. సకల సౌభాగ్యాలు కలుగుతాయి.
వ్రత కథ
పూర్వం జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలకు లోటే లేదు. కాని సంతానం లేకపోవడంతో ఆ దంపతులకు దిగులు ఎక్కువయింది. ఎన్నో పూజలు నోములు చేయడం వలన పరమేశ్వరునికి దంపతులపై కరుణ కలిగింది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో నగరానికి వచ్చి అంతఃపురం బయట నిలబడి "భవతీ భిక్షాందేహి" అన్నాడు. జయపాలుని భార్య భిక్ష వేసేందుకు వచ్చేలోపే ఆ సన్యాసి వెళ్లిపోయాడు. ఇలా మూడు రోజులు జరిగింది. జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు.
మరుసటిరోజు సన్యాసి వచ్చాడు. మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి సంతానం లేని వారి చేతి భిక్ష తాను స్వీకరించనని అన్నాడు. అప్పుడా రాణి సంతానం కలిగే మార్గం చెప్పమని వేడుకుంది. సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు నీలం రంగు వస్త్రాలను ధరించి, నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి, ఒంటరిగా తన భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమని చెప్పాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో ఆగిపోతుందో అక్కడ త్రవ్వితే ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుందని, ఆ ఆలయం లో ఉన్న అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానం ప్రసాదిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఈ విషయంతా భర్తకు చెప్పింది. సన్యాసి చెప్పినట్టే చేశారు. అమ్మవారు ప్రత్యక్షమయి, దీర్ఘాయువు, వైధవ్యం గల కన్య కావలా? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? అని అడిగింది. రాజు పిత్రుదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు.
కొంత కాలం తరువాత జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడికి వయసొచ్చింది. వివాహం జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేయాలనుకున్నారు. తన కుమారుణ్ణి అతని మేనమామతో ముందుగా విశ్వనాథుని దర్శనానికి కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండ,రండ అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ ముండలు, రండలు ఉండరు అంది కోపంతో, జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు. సుశీల అన్న మాటలు వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోచింది. సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ, సుశీల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి శివుడికి తమ కూతురుని ఇవ్వమని కోరగా వారు అంగీకరించి వారిద్దరికి వివాహం జరిపించారు. మంగళగౌరి కరుణ వలన శివుడికి అల్పాయుష్షు పోయి దీర్ఘాయుష్షుడవుతాడు. శ్రీకృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పినట్టు పురాణ వచనం.
2024 తేదీలు: ఆగష్టు: 06, 13, 20, 27 సెప్టెంబర్ 03.
Comments
Post a Comment