Garuda Panchami: గరుడ పంచమి
- శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని గరుడ పంచమిగా జరుపుకుంటారు
- తన తల్లి దాస్య విముక్తి కోసం గరుడుడు ఈ పంచమి రోజున అమృత భాండాన్ని పొందాడు. అందుకే యిది గరుడ పంచమి అయింది.
- నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనంద దాయకంగా ఉండాలని, స్త్రీలు తమకు పుట్టిన పిల్లలు బలంగా ఉండాలని కోరుతూ గరుడ పంచమి పూజ చేస్తారు.
- ఈ వ్రతాన్ని తమకు పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తున్న వారు మాత్రమే చేయాలి. గరుడుడు తల్లి దాస్యాన్ని విముక్తి చేసిన శ్రావణ శుద్ధ పంచమినాడు గరుడ పంచమి పర్వదినంగా జరుపుకోవడం ఆచారం.
- కృష్ణా గోదావరి జిల్లాల్లోని వారు, సాగర తీర వాసులు ఈ పర్వాన్ని విశేషంగా జరుపుకుంటారు.
- వ్రతరత్నాకరం, గరుడు పురాణం ఈ రెండు గ్రంథాల్లోనూ గరుడు పంచమి వ్రత విధానం గురించి ప్రస్తావన ఉంది.
- ఆగమ గ్రంథాలు, తంత్రశాస్త్రాల్లో కూడా ఈ వ్రతం గురించి విలక్షణంగా కనిపిస్తుంది
వ్రత విధానం
సోదరులున్న స్త్రీలందరూ గరుడపంచమి వ్రతం చేసుకోవచ్చు. పంచమి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుచిగా కొయ్యతో చేసిన చతురస్రాకారంలో ఉన్న పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయిదు రంగులతో ముగ్గు పెట్టాలి. పీటపై ముగ్గుమధ్యలో బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మధ్యలో తమలపాకు ఉంచి దానిపై బంగారు, వెండి లేదా మట్టితో చేసిన గరుత్మంతుని ప్రతిమ ఉంచాలి. ఇవేవీ వీలు కాని పక్షంలో గరుతంత్ముని చిత్రపటాన్ని ఉంచి పూజించవచ్చు. పూజకు ముందుగా అయిదు రంగుల దారాలకు అయిదు ముడులు వేసి అయిదు పూలతో కట్టిన తోరాన్ని ఉంచాలి. అనంతరం షోడశోపచారాలతో గరుడుణ్ణి పూజించాలి. చక్రపొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజించిన తోరాన్ని స్త్రీలు కుడి చేతికి ధరించాలి. ఇలాచేస్తే సర్ప భయం ఉండదని విశ్వసిస్తారు.
నేపాల్ దేశంలోని చాంగు నారాయణ్ అనే ప్రదేశంలో గరుడుని శిలా విగ్రహం ఉంది. దానిపై విష్ణువు కూర్చొని ఉంటాడు. గరుడ పంచమినాడు ఆ విగ్రహం చెమరిస్తూ ఉంటుంది. అర్చకులా చెమటను చేతిగుడ్డలతో తుడిచేస్తూ ఉంటారు. ఆ స్వేదజలం పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తుందని అక్కడి వాళ్లు చెబుతారు. ఆ దేశంలోని అన్ని దేవాలయాల్లో గరుత్మంతుని విగ్రహం మెడలో" సర్పరాజు దర్శనమివ్వడం విశేషం. ఇందుకు సంబంధించి అక్కడి వాళ్లు చెప్పే కారణం ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం గరుత్మంతునికి తక్షకునికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు గరుడుడు విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే, తక్షకుడు అవలోకితేశ్వరుణ్ణి సహాయం అర్థిస్తాడు. వాళ్లిద్దరూ వచ్చి గరుడునికి, తక్షకునికి సంధి చేకూరుస్తారు. దానికి గుర్తుగా గరుడుడు మెడలో తక్షకుణ్ణి మాలగా ధరిస్తాడు. ఇలాంటి కథనమే వంగదేశంలో కూడా వినిపిస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని విష్ణ్వాలయాల్లో గరుడ వాహనం మెడలో మాలగా తక్షకుడు కనిపిస్తాడు.
గరుడ పంచమిరోజున తిరుమలలో స్వామి వారికీ గరుడ సేవ జరుగుతుంది.
Comments
Post a Comment