Naga Chandreswara Temple:శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం (ఏడాదిలో శ్రావణ పంచమి రోజు మాత్రమే స్వామి వారి దర్శనం) - ఉజ్జయిని
జ్యోతిర్లింగ క్షేత్రాలలో దక్షిణాభిముఖుడైన శివుడు వెలిసిన ఏకైక క్షేత్రం ఉజ్జయిని. దక్షిణాభిముఖుడు, పశ్చిమాభిముఖుడు అయిన స్వామిని సేవిస్తే వెనువెంటనే సత్ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాల ద్వార తెలుస్తుంది.
ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో తూర్పుకు అభిముఖంగా ఓంకారేశ్వర మహాదేవుడు ఉంటాడు. దానికి కింది అంతస్తులో దక్షిణాభిముఖుడై మహాకాళేశ్వరుడు ఉంటాడు. పై అంతస్తులో అంటే మూడో అంతస్తులో నాగచంద్రేశ్వరస్వామి పశ్చిమాభిముఖుడై సద్యోజాతునిగా సపరివారంగా దర్శనమిస్తాడు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆయన దర్శనం ఉంటుంది. శ్రావణ శుద్ధపంచమినాడు ఉత్తరాదివారు నాగపంచమి పర్వదినాన్ని పాటిస్తారు. ఆరోజునే ఉజ్జయినిలో నాగచంద్రేశ్వరుని ఆలయం తెరుస్తారు. లక్షలాది భక్తులు నాగపంచమి రోజున ఉజ్జయినికి పోటెత్తుతారు.
అద్వితీయం స్వామిస్వరూపం
సాధారణంగా పరమేశ్వరుడు లింగాకారంలోనే దర్శనమిస్తాడు. కానీ నాగచంద్రేశ్వరుడు మాత్రం ఐదుపడగల తక్షకుణ్ణి ఆసనంగా చేసుకుని ఉంటాడు. ఒకచేతిలో నాగం ఉంటుంది. మరోచేత పార్వతిని పట్టుకుని ఉంటాడు. గణపతి, షణ్ముఖుడు కూడా పక్కనే దర్శనమిస్తారు. శివపార్వతుల పాదాల వద్ద పరమేశ్వరుని వాహనమైన నంది, అమ్మవారి వాహనమైన సింహం వేంచేసి ఉంటాయి. నాగరాజు అయిన తక్షకుడు పరమేశ్వరుణ్ణి ప్రార్ధించి పొందిన వరం చేత ఇక్కడ ఈ రూపంలో స్వామి వేంచేసి ఉన్నాడని ఐతిహ్యం. ఇటువంటి అద్భుతమైన శివస్వరూపాన్ని ఉజ్జయినిలో తప్ప ప్రపంచంలో మరెక్కడా చూడలేం. దీన్ని 11వ శతాబ్దిలో నేపాల్ నుంచి తీసుకువచ్చి ప్రతిష్టించారని ప్రతీతి. ఏడాదికి ఒక్కమారు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే నాగచంద్రేశ్వరుణ్ణి దర్శించడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. నాగపంచమి రోజు స్వయంగా ఫణిరాజు తక్షకుడు కూడా ఈ ఆలయంలోనే ఉంటాడని, స్వామిని సేవిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. నాగపంచమి రోజు ఈ స్వామిని దర్శించిన వారికి సకల నాగదోషాలు, కాలసర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయి. సంతానం కలుగుతుంది. నాగపంచమి నాడు ఉజ్జయిని క్షేత్రం జనసందోహంతో మరో కుంభమేళాను తలపిస్తుంది.
Comments
Post a Comment