Veerabhadra Temple: శ్రీ వీరభద్ర స్వామి ఆలయం - పట్టిసీమ
పట్టిసీమలో అతి పురాతనమైన శివక్షేత్రంగా అలరారుతోంది వీరభద్రస్వామి ఆలయం. పవిత్ర గోదావరి నదిలో స్నానం చేసి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని అంటారు. పెళ్ళికానివారు ఆలయ ప్రధాన మండపంలో ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని భక్తుల నమ్మకం. అలా కుదిరినవారు తరువాత స్వామికి మొక్కులు చెల్లించడం ఇక్కడ సంప్రదా యంగా వస్తోంది. అలాగే సంతానం లేని మహిళలు ఇక్కడున్న అనిస్త్రీ, పునిస్త్రీ దేవతలను దర్శించుకుని పక్కనే ఉన్న చెట్టుకు ముడుపు కడతారనీ అంటారు. వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా దర్శన మిచ్చే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా భూనీలా సమేత భావనారాయణస్వామి కొలువై ఉంటే... కనకదుర్గ, మహిషాసుర మర్దిని గ్రామ దేవతలుగా భక్తులు పూజలు అందుకోవడం విశేషం.
స్థలపురాణం
తండ్రి దక్షుడు చేసిన అవమానం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. అది విన్న పరమేశ్వరుడు. ప్రళయతాండవం చేస్తూ తన జటాఝూటం నుంచి ఒక జడను తీసి నేలకు కొట్టడంతో అందులోంచి వీరభద్రుడు బయటకొచ్చా దట. దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసి, అతడి శిరస్సును ఖండించమని వీరభద్రుడిని పరమేశ్వరుడు ఆదేశించాడట. ఈశ్వరుడు చెప్పినట్లుగా చేసిన వీరభద్రుడు ఆ తరువాత దేవకూట పర్వతంపైన ప్రళయతాండవం చేయడం మొదలు పెట్టాడట. దానికి భూమి అదరడంతో దేవతలంతా కలిసి అగస్త్య మహాముని సాయం కోరతారట. ఆయన వీరభద్రుడిని ఆలింగనం చేసుకోవడంతో వీరభద్రుడు లింగాకారంగా మారిపోయాడట. అలా వీరభద్రుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
పూర్వం పర్వతాలు గగన సంచారం చేస్తూ తెల్లారేసరికి భూమిపైన దిగేవట. దాంతో భూమిపైన ఉన్న జీవరాశులకు ప్రాణాపాయం ఉంటుందనే ఉద్దేశంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కల్ని ఖండించాడట. ఆ సమయంలోనే దేవకూట పర్వతం నది మధ్యలో పడి పోయిందట. అయితే... కొంతకాలం తరువాత దేవకూట పర్వతరాజు నారదుడి సలహాతో శివపంచాక్షరీ మంత్రాన్ని జపించి శివుడి అనుగ్రహం పొంది.... తనపైన కూడా స్థిరనివాసం ఏర్పరచుకోమని శివుడిని వేడుకున్నాడట. అలా శివుడు ఇక్కడ కొలువయ్యాడనీ అంటారు.
శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన మట్టా కుటుంబీకులు రాత్రంతా స్వామిని తిరునాళ్లలో ఊరేగించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. ఏటా ఈ నది మధ్యలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు వచ్చే లక్షల మంది భక్తులు వస్తారు. . కార్తీకమాసంలో స్వామికి చేసే లక్షపత్రి పూజను చూసేందుకు రెండుకళ్లూ చాలవని చెబుతారు.
నిడదవోలుకు నలభైకిలోమీటర్ల దూరంలో పట్టిసీమ ఉంది. పట్టిసీమ రేవు నుంచి పడవ పైన ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.
Comments
Post a Comment